తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayman Al-zawahiri : సర్జన్​ నుంచి అల్​ఖైదా అధినేత వరకు.. ఇదీ అల్​ జవహరి చరిత్ర

Ayman al-Zawahiri : సర్జన్​ నుంచి అల్​ఖైదా అధినేత వరకు.. ఇదీ అల్​ జవహరి చరిత్ర

Sharath Chitturi HT Telugu

02 August 2022, 7:10 IST

    • Ayman al-Zawahiri : అల్​ఖైదా అధినేత అల్​ జవహరి.. ఓ సర్జన్​. ఈజిప్ట్​ సైన్యంలో మూడేళ్లు పనిచేశాడు. అతడు.. బిన్​ లాడెన్​కు అత్యంత సన్నిహితుడు.
2001లో బిన్​ లాడెన్​తో అల్​ జవహరి
2001లో బిన్​ లాడెన్​తో అల్​ జవహరి (REUTERS )

2001లో బిన్​ లాడెన్​తో అల్​ జవహరి

Ayman al-Zawahiri : అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో అల్​ఖైదా అధినేత అయ్​మన్​ అల్​ జవహరి హతమయ్యాడు. అతను.. కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్​ లాడెన్​కు అత్యంత సన్నిహితుడు. అంతే కాదు.. అతనొక సర్జన్​ కూడా!

  • అయ్​మన్​ అల్​ జవహరి.. ఈజిప్ట్​ దేశస్థుడు. 1951 జూన్​ 19న గిజాలో జన్మించాడు. 2011లో ఒసామా బిన్​ లాడెన్​ను ప్రత్యేక ఆపరేషన్​లో మట్టుబెట్టింది అమెరికా సైన్యం. ఆ తర్వాత.. అతని స్థానాన్ని అల్​ జవహరి భర్తీ చేశాడు.
  • బిన్​ లాడెన్​లాగే.. 71ఏళ్ల అల్​ జవహరి కూడా విద్యావేత్త. బిన్​ లాడెన్​కు బిజినెస్​- ఎకనామిక్స్​ అడ్మినిస్ట్రేషన్​లో డిగ్రీ ఉంది. అతను ఒక సివిల్​ ఇంజినీర్​ కూడా. ఇక అల్​ జవహరి సైతం ఈజిప్ట్​లో సర్జన్​గా పనిచేశాడు. మూడేళ్ల పాటు ఈజిప్టు సైన్యానికి సేవలందించాడు.
  • 1981లో ఈజిప్ట్​ అధ్యక్షుడు అన్వర్​ సాదత్​ హత్య జరిగింది. ఈ ఘటనలో 100మందికిపైగా ప్రజలను అరెస్ట్​ చేశారు. వారిలో అల్​ జవహరి ఒకడు. అప్పుడు అతడి వయస్సు 30ఏళ్లు. ఆ సమయంలో అతడిని పోలీసులు జైలులో చిత్రహింసలకు గురిచేసినట్టు సమాచారం.
  • ఈఐజే(ఈజిప్టియన్​ ఇస్లామిక్​ జిహాద్​) సంస్థను స్థాపించిన అల్​ జవహరి.. 1998లో దానిని అల్​ఖైదాలో కలిపేశాడు. అతను బిన్​ లాడెన్​కు రైట్​ హ్యాండ్​! అందువల్ల బిన్​ లాడెన్​ ఉగ్ర కార్యకలాపాల్లో అల్​ జవహరి చురుకుగా పనిచేశాడు. అమెరికాపై ఎన్నో దాడులకు తెగబడ్డాడు. 9/11 దాడులను విజయవంతం చేసేందుకు.. బిన్​ లాడెన్​కు తన వంతు కృషి చేశాడు.
  • అల్​ జవహరి తలపై 25మిలియన్​ డాలర్ల రివార్డును ప్రకటించింది అమెరికా. 9/11 దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక అల్​ జవహరి మరణాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ధ్రువీకరించారు.

"నా ఆదేశాలతో.. అమెరికా సైన్యం.. శనివారం కాబుల్​లో వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో అల్​ జవహరి హతమయ్యాడు. ఎంత కాలం గడిచిపోయినా, ఎవరు ఎక్కడ దాగి ఉన్నా.. ప్రజలకు మీరు ముప్పు అని తెలిస్తే.. మిమ్మల్ని అమెరికా వేటాడి చంపేస్తుంది. న్యాయం జరిగింది. బిన్​ లాడెన్​కు జవహరి అత్యంత సన్నిహుతుడు. 9/11 దాడుల్లో బిన్​ లాడెన్​కు జవహరి డిప్యూటీగా పనిచేశాడు. 9/11 దాడులకు ప్రణాళికలు రచించడంలో అతనిది కీలక పాత్ర. ఏడాది క్రితం.. అఫ్గానిస్థాన్​లో అమెరికా సైన్యం కార్యకలాపాలను ముగించాలని నేను నిర్ణయించాను. 20ఏళ్ల తర్వాత అక్కడ మన సైన్యం అవసరం లేదనిపించింది. కానీ అమెరికా ప్రయోజనాల కోసం.. అఫ్గాన్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రజలకు మాట ఇచ్చాను. అల్​ఖైదా అధినేత విషయంలో ఇప్పుడదే చేశాను" అని మీడియాకు జో బైడెన్​ వెల్లడించారు.

టాపిక్