Ayman al-Zawahiri : అఫ్గాన్‌లో అమెరికా వైమానిక దాడి.. అల్‌ఖైదా అధినేత హతం
Ayman al-Zawahiri : అల్‌ఖైదా అధినేత అల్ జవహరిని అమెరికా సైన్యం మట్టుబెట్టినట్టు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఈ మేరకు అఫ్గాన్‌లో వైమానిక దాడి జరిపినట్టు వివరించారు.
Ayman al-Zawahiri : అఫ్గానిస్థాన్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో అల్‌ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహరి హతమయ్యాడు. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
"నా ఆదేశాలతో.. అమెరికా సైన్యం.. శనివారం కాబుల్‌లో వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో అల్ జవహరి హతమయ్యాడు. ఎంత కాలం గడిచిపోయినా, ఎవరు ఎక్కడ దాగి ఉన్నా.. ప్రజలకు మీరు ముప్పు అని తెలిస్తే.. మిమ్మల్ని అమెరికా వేటాడి చంపేస్తుంది. న్యాయం జరిగింది," అని మీడియాకు జో బైడెన్ వెల్లడించారు.
అమెరికా పౌరులు, దౌత్యవేత్తలు, సైన్యాధికారులను హత్య చేసే విధంగా అయ్మన్ అల్ జవహరి కుట్ర పన్నినట్టు బైడెన్ ఆరోపించారు.
"బిన్ లాడెన్‌కు జవహరి అత్యంత సన్నిహుతుడు. 9/11 దాడుల్లో బిన్ లాడెన్‌కు జవహరి డిప్యూటీగా పనిచేశాడు. 9/11 దాడులకు ప్రణాళికలు రచించడంలో అతనిది కీలక పాత్ర," అని జో బైడెన్ వివరించారు.
"ఏడాది క్రితం.. అఫ్గానిస్థాన్‌లో అమెరికా సైన్యం కార్యకలాపాలను ముగించాలని నేను నిర్ణయించాను. 20ఏళ్ల తర్వాత అక్కడ మన సైన్యం అవసరం లేదనిపించింది. కానీ అమెరికా ప్రయోజనాల కోసం.. అఫ్గాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రజలకు మాట ఇచ్చాను. అల్‌ఖైదా అధినేత విషయంలో ఇప్పుడదే చేశాను," అని జో బైడెన్ పేర్కొన్నారు.
బైడెన్ ప్రకటనకు ముందే.. అఫ్గాన్‌లో అమెరికా వైమానిక దాడి జరిపినట్టు వార్తలు బయటకొచ్చాయి. జులై 31న కాబుల్‌లో వాయుదాడి జరిగినట్టు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజిహిద్ మీడియాకు తెలిపారు.
అయితే అమెరికా చర్యలపై తాలిబన్ ప్రభుత్వం మండిపడింది. దోహా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది.
సంబంధిత కథనం
టాపిక్