Breakfast Recipe: వీకెండ్‌ని పిస్తా డేట్స్ మఫిన్తో స్టార్ చేయండి.. అదిరిపోతుంది
10 September 2022, 7:41 IST
- Dates and Pista Muffin : వీకెండ్ వచ్చినప్పుడు కొత్తగా ఏమైనా ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఫుడ్ కూడా కావొచ్చు. మరి వాటిని ఇంట్లోనే ఎందుకు తయారు చేసుకోకూడదు చెప్పండి. మీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఓ మఫిన్తో ఎందుకు స్టార్ చేయకూడదు. మీకు మఫిన్ చేయడం రాదా? అయితే ఈ డేట్స్ పిస్తా మఫిన్ రెసిపీ మీకోసమే.
పిస్తా డేట్స్ మఫిన్
Dates and Pista Muffin : మఫిన్ అనగానే ఆరోగ్యానికి మంచిది కాదేమో అనుకోకండి. ఈ డేట్స్, పిస్తా మఫిన్ ఆరోగ్యకరమైన, పోషకమైన ట్రీట్. అంతేకాకుండా దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా హ్యాపీగా లాగించేయవచ్చు. ఇంక పిల్లలకు మఫిన్స్ ఇష్టం లేకుండా ఉంటాయా చెప్పండి. పైగా ఈ వంటకం అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి జిమ్‌కు వెళ్లేవారు కూడా దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరం, పిస్తా మఫిన్ తయారీకి కావాల్సి పదార్థాలు
* నెయ్యి - 1/4 కప్పు
* ఖాండ్ - 1/4 కప్పు (చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం)
* రాగి పిండి - 1 1/2
* గోధుమ పిండి - 3/4 కప్పు
* మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు - తగినంత
* ఏలకుల పొడి - 1 1/2 టీస్పూన్
* బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్
* బేకింగ్ సోడా - అర టీస్పూన్
* మజ్జిగ - 1 కప్పు
* నీళ్లు - అరకప్పు
* ఖర్జూరం - 1 కప్పు
* పిస్తా - 1 కప్పు
ఖర్జూరం, పిస్తా మఫిన్ తయారీ విధానం
ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్ చేయండి. మీ మఫిన్ ట్రేని తీసుకుని వెన్న రాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో వెన్న, ఖాండ్‌లను కలపండి. ఇది క్రీమ్ లాంటి ఆకృతిని ఇస్తుంది. దానిలో రాగి పిండి, గోధుమపిండిని వేసి బాగా కలపండి.
మొక్కజొన్న పిండి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మజ్జిగ, నీరు వేసి.. అన్ని పదార్థాలు సరిగ్గా కలిసే వరకు బాగా కలపండి. తరిగిన ఖర్జూరాలు, పిస్తాలను దానిలో వేయండి. ఈ మిశ్రమాన్ని మఫిన్ ట్రేలో వేసి 25-30 నిమిషాలు బేక్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన ఖర్జూరం, పిస్తా మఫిన్స్ రెడి.