తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kolache Pohe | రుచిలో ఆహా అనిపించే కొలాచి పోహా.. ఇంతవరకు మీకు తెలియని రెసిపీ!

Kolache Pohe | రుచిలో ఆహా అనిపించే కొలాచి పోహా.. ఇంతవరకు మీకు తెలియని రెసిపీ!

HT Telugu Desk HT Telugu

19 June 2022, 9:33 IST

    • మీరు అటుకులను నానబెట్టి టమాటోతో కలిపిన పోహా, బంగాళదుంప ముక్కలు కలిపిన పోహా తినిఉండవచ్చు, కానీ కొంచెం తీపి- పులుపు కలిగిన రుచిలో అద్భుతంగా ఉండే కొంకణీ స్టైల్ 'కొలాచీ పోహాను' ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఇక్కడ రెసిపీ అందించాం. తప్పకుండా ఒకసారి దీని రుచి చూడండి..
Kolache Pohe
Kolache Pohe (Youtube screengrab)

Kolache Pohe

ఇండియాలో దక్షిణం వైపైనా, ఉత్తరం వైపైనా కామన్ గా తినే అల్పాహారాలలో పోహా ఒకటి. దీనినే అవలక్కి లేదా అటుకులు అని ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ అల్పాహారంఎంతో తేలికైనది, అలాగే ఆరోగ్యకరమైనది. ఈ అటుకులు అనేవి వరి ధాన్యంతోనే తయారవుతాయి గానీ అన్నంతో పోలిస్తే అటుకుల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవచ్చు. సులభంగా జీర్ణంం అవుతుంది కూడా. అందుకే ఎక్కువ మంది అటుకులను తినటానికి ఇష్టపడతారు.

పోహాను ఒక్కోచోట ఒక్కోలా తయారు చేసుకుంటారు. మీరు కూడా టొమాటోతో చేసిన పోహా, ఆలూ చేసిన పోహా తిని ఉండవచ్చు. మరి కొంకణి స్టైల్లో తయారు చేసే 'కొలాచి పోహా'ను ఎప్పుడైనా తిన్నారా? కచ్చితంగా మీరు ఇలా తిని ఉండకపోవచ్చు. కొలాచి పోహా రుచిలో భిన్నంగా ఉంటుంది. ఈ రుచిని మీరు ఆస్వాదిస్తారు కూడా. కొలాచే పోహా కొంచెం తీపి, కొంచెం పుల్లని రుచిని కలిగి ఉంటుంది. కడుపులో తేలికగా ఉంటుంది. అంతేకాదు దీనిని చిటికెలోనే తయారు చేసుకోవచ్చు.మరి ఈ కొలాచి పోహాకు కావాల్సిన పదార్థాలేంటి, ఎలా తయారు చేసుకోవాలో తెలియజేసే రెసిపీని ఇక్కడ అందించాం. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేసుకోండి.

కొలాచి పోహాకు కావాల్సినవి 

  • 1 కప్పు అటుకులు (నానబెట్టినవి)
  • 1 గిన్నె కొబ్బరి పాలు
  • బెల్లం చిన్న ముక్క
  • చింతపండు గుజ్జు రుచికి తగినంత
  • 2 పచ్చిమిర్చి (తరిగినవి)
  • 1/2 స్పూన్ జీలకర్ర
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • చిటికెడు ఇంగువ
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 ఎర్ర మిరపకాయ
  • 1 టేబుల్ స్పూన్ నెయ్యి
  • 1 tsp తాజా కొత్తిమీర
  • ఉప్పు రుచికి తగినంత

తయారీ విధానం

  1. బెల్లం, చింతపండును విడివిడిగా నీళ్లలో నానబెట్టాలి
  2. మరొక గిన్నెలో కొబ్బరి పాలు తీసుకొనిఇందులోనే బెల్లం, చింతపండు నీటిని కలుపుకోవాలి. ఆపై ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీరవేసి అన్నింటినీ బాగా కలపండి.
  3. ఇప్పుడు పాన్ మీద నెయ్యి వేడి చేసి అందులో ఎండు మిర్చి, జీరా, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
  4. ఈ పోపును కొబ్బరి పాలు కలిపిన మిశ్రమంలో వేసి అనంతరం ఈ మిశ్రమాన్ని నానబెట్టిన అటుకులకు కలుపుకోవాలి.

అంతే ఘుమఘుమలాడే రుచికరమైన కొలాచి పోహా తినడానికి సిద్ధంగా ఉంది. సర్వింగ్ గిన్నెల్లోకి తీసుకొని వేడివేడిగా, సూప్‌లాగా ఉండే ఈ కొలాచి పోహా నోట్లోనే కరిగిపోతుంది.

టాపిక్