Egg in a Blanket | దుప్పట్లో దూరిన గుడ్డు.. ఇది మార్నింగ్ సమయంలో మంచి ఫుడ్డు!
15 May 2022, 9:48 IST
- సులభంగా, తేలికగా.. తక్కువ సమయంలోనే సిద్ధంచేసుకొనే దుప్పట్లో గుడ్డు (Egg in a Blanket) రెసిపీ ఇక్కడ ఉంది. దీనినే రంధ్రంలో గుడ్డు (Egg in a hole), ద్వీపంలో గుడ్డు (Eggs in the island) ఇలా వివిధ పేర్లతోనూ పిలుస్తారు. ఆసక్తికరంగా ఉంది కదా? మరి ఆలస్యమెందుకు అదేంటో తెలుసుకొని మీరు ప్రయత్నించండి.
egg in a blanket recipe
ప్రతీవారం సెలవు ఉన్న రోజుల్లో చాలామందికి సోమరితనం ఆవహిస్తుంది. దీంతో పనులు చేయడానికి బద్ధకంగా అనిపిస్తుంది. ఏ పనిచేయక పోయినా బ్రేక్ ఫాస్ట్ చేయడం ఎంతో ముఖ్యమైన పని కాబట్టి.. మీరు సులువుగా, తేలికగా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఐడియాను ఇక్కడ తెలియజేస్తున్నాం. వారంతపు సెలవు రోజుల్లో విందు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువ. అందుకే మిమ్మల్ని మధ్యాహ్నం వరకు ఎనర్జీగా ఉంచే సూపర్ ఈజీ 'ఎగ్ ఇన్ బ్లాంకెట్' రెసిపీని ఇక్కడ ఇచ్చాం.
ఎగ్ ఇన్ బ్లాంకెట్ అంటే ఇదేదో కొత్తరకం వంటకం అనుకునేరు. అదేం కాదు కాకపోతే తయారు చేసే విధానం కొత్తగా ఉంటుంది. దీనిని బొక్కలో గుడ్డు (ఎగ్ ఇన్ అ హోల్) లేదా ఫ్రేములో గుడ్డు, దాగుడు మూతల గుడ్డు (హైడ్ అండ్ సీక్ ఎగ్) ఇలా రకరాల పేర్లతోనూ పిలుస్తారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలేంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
కావాల్సినవి
- 2 గుడ్లు
- 2 బ్రౌన్ బ్రెడ్ ముక్కలు
- 2 టేబుల్ స్పూన్లు వెన్న
- రుచికోసం ఉప్పు- ఎండు మిర్చి కారం
తయారీ విధానం
- బ్రెడ్‌కి ఒకవైపు వెన్న లేదా నెయ్యి లేదా నూనె అద్దండి. బిస్కట్ కట్టర్‌ని లేదా ఒక గ్లాసును ఉపయోగించి బ్రెడ్ ముక్క మధ్యలో కత్తిరించి ఒక రంధ్రం చేయండి. మీరు కావాలనుకుంటే రంధ్రాన్ని హృదయం ఆకారంలోనూ చేసుకోవచ్చు.
- ఇప్పుడు ప్యాన్‌లో 1 టేబుల్‌స్పూన్ బటర్‌ను వేడి చేసి దానిపై కత్తిరించిన బ్రెడ్ స్లైస్‌ను గోధుమ రంగు వచ్చేంతవరకు రోస్ట్ చేయండి. మంటను తక్కువగా ఉంచుకోవాలి. కత్తిరించగా మిగిలిన గుండ్రని బ్రెడ్ ముక్కలను రోస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు బ్రెడ్ ముక్కలను మరోవైపు తిప్పండి. బ్రెడ్ ముక్కకు ఉన్న రంధ్రంలో కోడి గుడ్డును పగలగొట్టి నెమ్మదిగా వేయండి.
- తర్వాత మూతపెట్టి 3-4 నిమిషాల పాటు చిన్నని మంట మీద వేయించాలి.
- గుడ్డు సరిగ్గా ఉడికినట్లు అనిపించగానే, మిగతా బ్రెడ్ ముక్కలతోనూ ఇదే ప్రక్రియను పునరావృతం చేయండి.
- ఇప్పుడు బ్రెడ్ ముక్కలను సర్వింగ్ ప్లేటులోకి తీసుకొని ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోండి. దీనినే ఎగ్ ఇన్ బ్లాంకెట్ అంటారు.
వేడివేడిగా టీ తాగుతూ 'దుప్పట్లో గుడ్డు'ను తింటూ మీ సెలవు రోజును శక్తివంతంగా మొదలుపెట్టండి.