తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కోడి కంటే గుడ్డే వెరీ గుడ్డు! రోజూ రెండు గుడ్లు తింటే చాలు, ఎన్నో ప్రయోజనాలు!!

కోడి కంటే గుడ్డే వెరీ గుడ్డు! రోజూ రెండు గుడ్లు తింటే చాలు, ఎన్నో ప్రయోజనాలు!!

Manda Vikas HT Telugu

28 February 2022, 18:11 IST

google News
    • రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం పూర్తిగా సురక్షితమే కాకుండా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఒక శాస్త్రీయ పరిశోధనలో తేలింది. అయితే గుడ్డులో ఉండే పచ్చసొనలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఆరోగ్యానికి హానికరం అని కొందరు దానిని తినకుండా ఉంటున్నప్పటికీ మితంగా తింటే ఎలాంటి సమస్య లేదని పరిశోధకులు చెబుతున్నారు. 
Nutrition with Eggs
Nutrition with Eggs (Shutterstock)

Nutrition with Eggs

గుడ్డు చేసే మేలు దాన్ని పెట్టిన కోడి కూడా చేయదు. రోజూ గుడ్డు తినడం చికెన్ తినటం కంటే ఎంతో శ్రేష్ఠమైనదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలా అని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం పూర్తిగా సురక్షితమే కాకుండా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఒక శాస్త్రీయ పరిశోధన ప్రకారం వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజూ ఆమ్లెట్‌లు, ఉడికించిన గుడ్లు లేదా గిలకొట్టిన గుడ్లతో చేసింది ఏదో ఒకటి లేనిదే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. అయితే గుడ్డులో ఉండే పచ్చసొనలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఆరోగ్యానికి హానికరం అని కొందరు దానిని తినకుండా ఉంటున్నప్పటికీ మితంగా తింటే ఎలాంటి సమస్య లేదని పరిశోధకులు చెబుతున్నారు. 

గుడ్లలో బయో ప్రోటీన్ ఉంటుంది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. వ్యాయామాలు, వర్కౌట్స్ చేసేవారు గుడ్లు తింటే కండరాలు పెరగడంతో పాటు, ఎముకలకు మరింత దృఢత్వం లభిస్తుంది. మరో మంచి విషయం ఏమిటంటే, గుడ్లు తినడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ గా పిలిచే లిపోప్రొటీన్ (HDL) పెరుగుతుంది. HDL కొలెస్ట్రాల్ తగినంత స్థాయిలో ఉంటే గుండె పోటుతో పాటు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, ఆరు వారాల పాటు రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల శరీరంలో హెచ్‌డిఎల్ 10 శాతం పెరుగుతుంది.

రోజూ రెండు గుడ్లు తీసుకోవడం ద్వారా పొందగలిగే మరికొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:

చర్మం, వెంట్రుకలు, గోళ్ల ఆరోగ్యానికి

గుడ్లలో విటమిన్ B12, B5, బయోటిన్, రిబోఫ్లావిన్, థయమిన్ లాంటి B కాంప్లెక్స్ D, E విటమిన్లతో పాటు సెలీనియం, ఐరన్, ఫోలేట్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎంజైమ్‌లు ఉత్పత్తిని పెంచి జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా చర్మ స్థితిస్థాపకతను పెంచడంతో పాటు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నిరోధిస్తాయి. శరీరానికి అవసరమయ్యే 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ఏకైక ఆహారం గుడ్లు. అందుకే తినే ఆహారంలో గుడ్లు తప్పకుండా చేర్చుకోవాలి.

రోగ నిరోధక శక్తి కోసం

సిఫార్సు చేసిన మేరకు రోజూ ఆహారంలో 2 గుడ్లు చేర్చడం ద్వారా శరీరానికి తగిన స్థాయిలో సెలీనియం, విటమిన్ A , ఐరన్ లభిస్తాయి. ఈ పోషకాలు శరీరంలో యాంటీబాడీస్- రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు, ఫ్లూ లాంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తూ, ఉత్తమ నివారణగా పనిచేస్తాయి.

మెరుగైన కంటిచూపు కోసం

గుడ్లలో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవే మన కంటిలోని రెటీనాలో కూడా కనిపిస్తాయి. గుడ్లలో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఒమెగా 3 రెటీనా క్షీణతను తగ్గించి దీర్ఘకాలం పాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది.

గర్భిణీలకు ఎంతో మేలు

గుడ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భాధారణ సమయంలో ఈ పోషకాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది పిండం అభివృద్ధి, పెరుగుదలకు తోడ్పడుతుంది.

ఎముకల ఆరోగ్యం కోసం

చాలా మందికి విటమిన్ D లోపంతో ఎముకలు బలహీనంగా మారతాయి. ఫలితంగా బోలు, ఎముక క్షీణతతో బాధపడుతుంటారు. దీనిని అధిగమించాలంటే శరీరానికి విటమిన్ D అవసరం. రోజూ ఉదయాన్నే సూర్యకిరణాల ద్వారా విటమిన్ డి సహజంగానే లభిస్తుంది. దీంతో పాటు గుడ్లలోని విటమిన్ D కూడా శరీరంలో కాల్షియంను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరి ఇన్ని ప్రయోజనాలున్నపుడు బోరింగ్ రుచులు ఎందుకు? గుడ్డు తినడమే వెరీ గుడ్డు!

 

తదుపరి వ్యాసం