హిక్.. హిక్.. ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి? సులభంగా నియంత్రించడం ఎలాగో చూడండి
28 February 2022, 18:32 IST
- ఎక్కిళ్లు రావటానికి చాలా కారణాలుంటాయి. అవి భౌతికమైనవి కావొచ్చు లేదా భావోద్వేగమై కారణాలు కావొచ్చు. వీటికి మీ ఊపిరితిత్తుల కింద ఉండే డయాఫ్రామ్ అనే కండరం కారణం. డయాఫ్రామ్ శ్వాసను నియంత్రిస్తుంది. ఏదైనా మీ డయాఫ్రామ్‌ను చికాకుపెడితే, ఇది ఒక ప్రత్యేకమైన 'హిక్' అని శబ్దం చేస్తుంది.
Hiccups are harmless and go away on their own.
గడియారం ముల్లు టిక్ టిక్ టిక్ మని కొట్టుకుంటున్నట్లే అప్పుడపుడు మీ గొంతు కూడా హిక్ హిక్ హిక్ మని శబ్దం చేస్తుంది. వీటినే ఎక్కిళ్లు అంటారు. దీనికి మీ ఊపిరితిత్తుల కింద ఉండే డయాఫ్రామ్ అనే కండరం కారణం. డయాఫ్రామ్ శ్వాసను నియంత్రిస్తుంది. డయాఫ్రామ్ సంకోచించినప్పుడు ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను తీసుకుంటాయి, సడలించినప్పుడు ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. కానీ ఏదైనా మీ డయాఫ్రామ్‌ను చికాకుపెడితే, ఇది ఒక ప్రత్యేకమైన 'హిక్' అని శబ్దం చేస్తుంది. ఇది కూడా ఒకరమైన దగ్గు లాంటిదే.
ఎక్కిళ్లు రావటానికి చాలా కారణాలుంటాయి. అవి భౌతికమైనవి కావొచ్చు లేదా భావోద్వేగమై కారణాలు కావొచ్చు.ముఖ్యంగా అతిగా తినటం, మద్యపానం సేవించటం, సోడా సంబంధిత పానీయాలు సేవించడం, త్వరత్వరగా తినటం, తాగటం చేసినపుడు, పొగాకు, చ్యూయింగ్ గమ్ నమిలే అలవాటు, స్పైసీ ఫుడ్ తినడం, గొంతు కండరంలో ఏవైనా సమస్యలు లేదా భయం ఆందోళనలు ఎక్కువైనపుడు ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో ట్యూమర్స్, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి, ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాతావరణ కాలుష్యం పడనివారికి కూడా ఎక్కిళ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది.
ఎక్కిళ్లను నియంత్రించడం ఎలా?
ఎక్కిళ్లు చాలా సాధారణం, కొద్దిసేపటికి వాటంతటవే పోతాయి. అయితే పనిగా చికాకుపెడుతూ ఉంటే మాత్రం కొన్ని సులభమైన చిట్కాలను ఉపయోగించి ఎక్కిళ్లను తరిమేయవచ్చు.
1. చల్లని నీరు
ఎక్కిళ్లను వదిలించుకోవడానికి చల్లని నీరే ఒక ఔషధంగా పనిచేస్తుంది. చల్లటి నీటిని సిప్ చేయడం, గరగరళాడించడం ద్వారా మంచి అనుభూతి కలుగుతుంది.
2. లోతైన శ్వాస తీసుకోండి
ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే, ముందుగా మీ ఊపిరితిత్తుల నుండి గాలి మొత్తాన్ని వదలండి. అప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకొని కొద్దిసేపు ఊపిరి బిగపట్టి ఉంచండి, ఆ తర్వాత వదిలేయండి. దీనినే పునరావృతం చేస్తూ ఉండండి ఎక్కిళ్లు పోతాయి.
3. చక్కెర
కొంచెం చక్కెర తినడం ద్వారా ఎక్కిళ్లను ఎదుర్కోవచ్చ. ఒక టీస్పూన్ చక్కెరను మీ నాలుకపై 10 సెకన్ల పాటు అలాగే ఉంచండి, ఆపై మీ ఎక్కిళ్ళు మాయమవుతున్నట్లు మీకే అనిపిస్తుంది.
4. గోరు వెచ్చని నీరు
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగేయటం ద్వారా ఎక్కిళ్లు మాయమవుతాయి.
5. తేనుపు
ఉద్దేశపూర్వకంగా తేనుపులు తెచ్చుకోవడం ద్వారా మీ ఎక్కిళ్లను తగ్గించుకోవచ్చు.
ఎక్కిళ్లు సర్వ సాధారణమైనవి, అందరికీ వస్తాయి. ఇవి ఏ వయసులో వారికైనా రావొచ్చు. ఎక్కిళ్లు ప్రమాదకరమైనవి కాకపోయినప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా అదేపనిగా సుమారు 3 గంటలకు మించి దీర్ఘకాలంగా వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.