Mutton Causes Cancer | మటన్ కూడా క్యాన్సర్‌కు ఒక కారకం.. ఇలా వండితే!
08 May 2022, 10:00 IST
- మీరు మాంసాహారులా? ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మటన్ కూరనా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. మటన్ తింటే పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. అయితే అన్ని సందర్భాలలో కాదు, ఈ రకంగా వండితే. అదేంటో తప్పక తెలుసుకోండి..
Red Meat Stew
ఆదివారం అంటే చాలా మందికి మటన్ వారం. కోరికోరి మటన్ కూర తెచ్చి వండుకొని కొసరికొసరి తిందామనుకుంటారు. ఏదైనా విందుకు వెళ్లి కడుపునిండుగా లాగిద్దామనుకుంటారు. వాస్తవానికి ఇతర మాంసాలతో పోలిస్తే మేక మాంసం ఎంతో ఆరోగ్యకరమైనదిగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఐరన్ శాతం అధికంగా ఉంటుంది.
సుమారు 300 గ్రాముల మటన్ తింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా బి-విటమిన్లు, జింక్ ఇంకా పొటాషియం లాంటి పోషకాలు శరీరానికి అందుతాయి.
అంతేకాకుండా చికెన్ తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. కానీ మటన్ తో అలాంటి సమస్యలేమి ఉండవు. మటన్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది.
మేక రకరకాల ఆకులను, ఔషధ మొక్కలను తింటుంది కాబట్టి గొర్రె మాంసం కంటే కూడా మేక మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. మంచిగా సుగంధ ద్రవ్యాలు వేసి వండితే దానికి ఉండే ఆ ప్రత్యేకమైన రుచి దేనికీ ఉండదు. ఆరోగ్యకరం కూడా కాబట్టే మేక మాంసానికి అంత డిమాండ్.
మరి అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా ఏంటీ సమస్యా అని అనుకుంటున్నారా? అసలు పాయింట్‌కి వస్తే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే మటన్ ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందని తాజా అధ్యయనాలు తెలిపాయి. అయితే అది మటన్ తినడం వలన అని కాకుండా మటన్ చేసే విధానంతో ముడిపడి ఉంది. ఈ మేరకు మటన్ ఎలా వండకూడదో ఆరోగ్య నిపుణులు సూచించారు.
మటన్ ఇలా వండకూడదు
మటన్‌ను కాల్చినపుడు లేదా అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినపుడు వివిధ రసాయినక చర్యలు జరిగి మాంసంలో హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCAలు), పాలీసైక్లిక్ అమైన్‌లు (PAHలు) ఏర్పడటానికి దారితీయవచ్చు. ఈ HCAలు, PAHలు మనుషుల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని బలమైన వాదనలు ఉన్నాయి. కాబట్టి మటన్‌ను కాల్చడం కానీ, ఎక్కువ మంటలో ఉడికించడం కానీ చేయకూడదు. ఉడికీ ఉడకని మాంసాన్ని తినకూడదు.
మటన్ ఎప్పుడూ తక్కువ మంట మీద ఎక్కువ సేపు వండితే అది ఎంతో రుచికరంగా మారడటమే కాకుండా సురక్షితమైన విధానం అని చెబుతున్నారు. అందువల్ల మటన్‌లోని పోషకాలు అందాలన్నా, అది ఆరోగ్యకరమైన వంటకం అవ్వాలన్నా తక్కువ మంట మీద మెల్లిగా ఉడికించాలి, సరిగ్గా వండిన తర్వాతే తినాలని సిఫారసు చేస్తున్నారు.
కాబట్టి మాంసాహారులారా.. మటన్ ప్రియులారా.. మటన్ మంచిగా వండుకోండి, కమ్మగా తినండి, ఆరోగ్యంగా ఉండండి.