తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Period Delay Pills: పీరియడ్స్ వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా?

period delay pills: పీరియడ్స్ వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా?

HT Telugu Desk HT Telugu

17 May 2023, 17:38 IST

  • period delay pills: కొన్ని సార్లు వివిధ అవసరాల వల్ల పీరియడ్స్ వాయిదా వేసే మాత్రలు వేసుకునే విషయం తెలిసిందే. కానీ ఆ మాత్రల వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. 

నెలసరి వాయిదా చేసే ట్యాబ్లెట్ల వాడకం
నెలసరి వాయిదా చేసే ట్యాబ్లెట్ల వాడకం (pexels)

నెలసరి వాయిదా చేసే ట్యాబ్లెట్ల వాడకం

పీరియడ్స్ కొన్ని రోజులు వాయిదా వేయడానికి ట్యాబ్లెట్లు వాడతారు చాలామంది. ముఖ్యమైన పని ఉండటం వల్ల, పెళ్లి, ప్రయాణాలు, తీర్థయాత్రలు, పరీక్షలు, శుభకార్యాలు, పండగలు.. ఇలా కొన్ని కారణాల వల్ల పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్లు వాడతారు. కానీ వాటిని తరచూ వాడటం, ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. ఈ మాత్రలు వాడాల్సి వస్తే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే వీటి ప్రభావం వల్ల వేరే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

పీరియడ్స్ వాయిదా ఎలా అవుతాయి?

క్రమం తప్పకుండా నెలసరి రావడానికి హార్మోన్ల స్థాయులే కారణం. వాటిలో హెచ్చుతగ్గుల వల్లే పీరియడ్స్ వస్తాయి. శరీరంలో ప్రొజెస్టిరాన్ స్థాయులు తగ్గినపుడు గర్భాశయం చుట్టూ ఉన్న పొర తొలిగిపోతుంది. నెలసరి రావడానికి కారణం ఇదే. పీరియడ్స్ వాయిదా చేసే మాత్రల్లో సింథటిక్ ప్రొజెస్టిరాన్ ఉంటుంది. ప్రొజెస్టిరాన్ స్థాయులు తగ్గకుండా ఈ మాత్రలు పనిచేస్తాయి. అందువల్ల పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.

ఎప్పుడు వేసుకుంటారు?

నెలసరి ప్రారంభం అవుతుందనగా మూడు రోజుల ముం‌దు నుంచే వీటిని వేసుకోవాలి. ప్రతి రోజు డాక్టర్ సూచించినన్ని మాత్రలు వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ల ద్వారా రెండు వారాల వరకు కూడా నెలసరి వాయిదా అవుతుంది. ఇవి వేసుకోవడం మానేసిన వారం రోజుల లోపే నెలసరి వస్తుంది.

ఈ మాత్రలు వేసుకుంటే ఏమవుతుంది?

  • ‌తప్పనిసరి పరిస్థితుల్లో చాలా ముఖ్యమైన పనుల కోసం వీటిని వాడితే పరవాలేదు. అది కూడా వైద్యుల్ని సంప్రదించే వేసుకోవాలి. లేదంటే దీర్ఘకాలికంగా దుష్ప్రభావం ఉంటుంది.
  • కొంతమందిలో ఈ మాత్రలు వాడిన తరువాత బ్లీడింగ్ ఎక్కువవుతుంది. కొంతమందిలో చాలా నెలల వరకు ఈ సమస్య ఉంటుంది.
  • ఈ మాత్రలు ఎక్కువగా వాడితే గర్భదారణ విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • కొంతమందితో నెలసరితో సంబంధం లేకుండా బ్లడ్ స్పాటింగ్ సమస్య మొదలవ్వొచ్చు.
  • ఆందోళన పెరగడం, వక్షోజాల్లో నొప్పి రావడం లాంటి ఇబ్బందులు మొదలవుతాయి.
  • డయేరియా రావచ్చు. పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది.

కాబట్టి ప్రతి చిన్న అవసరానికి ఈ మాత్రల జోలికి పోకండి. పీరియడ్స్ ఆపడం అంటే మన శరీర హార్మోన్ల స్థాయుల్ని తారుమారు చేయడమే అని గుర్తుంచుకోండి.