Bleeding in early pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది?
Bleeding in early pregnancy: ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లీడింగ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? ఏ రకమైన బ్లీడింగ్ ప్రమాదాన్ని సూచిస్తుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
Bleeding in early pregnancy: ప్రెగ్నెన్సీ వచ్చిన తరువాత కొన్నిసార్లు కొంతమేర బ్లీడింగ్ ఏర్పడుతుంది. దీనినే స్పాటింగ్ అంటారు. పిండం అభివృద్ధి చెంది గర్భాశయ గోడలకు అతుక్కునే క్రమంలో ఇలా జరగొచ్చు. సాధారణంగా ఇది మీ పీరియడ్ రావాల్సి ఉన్న సమయంలో ఇలా కనిపించొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాశయ ముఖ ద్వారం మార్పులకు లోనవుతుంది. ప్రధానంగా హార్మోనల్ మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఇది స్పాటింగ్‌కు కారణమవుతుంది. స్పాటింగ్‌లో రక్తం ఎరుపు లేదా గులాబీ వర్ణంలో ఉంటుంది. ఒక్కోసారి బ్రౌన్ కలర్‌లో, పాత రక్తంలా ఉంటుంది. లేదా మీకు పీరియడ్స్ ప్రారంభమైనప్పుడు గానీ, ముగిసినప్పుడు గానీ ఉండే రక్తం రంగులో ఈ స్పాటింగ్ ఉంటుంది. స్పాటింగ్ చాలా కొద్ది మొత్తంలోనే ఉంటుంది.
తొలి 12 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో యోని నుంచి రక్తస్రావం కావడం మిస్‌క్యారేజ్(గర్భస్రావం) లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సూచిస్తుంది.
తొలి వారాల్లో బ్లీడింగ్ అయినప్పుడు అది ఆగడానికి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. గతంలో మిస్‌క్యారేజ్ అయిన సందర్భాలు ఉంటే ప్రొజెస్టెరోన్ వంటి హార్మోనల్ మందులు సిఫారసు చేస్తారు. దీనిని 16వ వారం వరకు కొనసాగిస్తారు.
గర్భ స్రావం అయినప్పుడు
24వ వారంలోపు ప్రెగ్నెన్సీలో గర్భస్రావం అయితే దానిని మిస్‌క్యారేజ్‌గా పిలుస్తారు. దాదాపు ఐదుగురిలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇక 14 వారాల్లోపు మిస్‌క్యారేజ్ అయితే పిండం ఎదుగుదలలో లోపం ఉన్నట్టు వైద్యులు నిర్ధారిస్తారు. లేదా హార్మోన్ సమస్యలు, రక్తం గడ్డకట్టడం వంటి ఇతర కారణాలూ ఉండొచ్చు.
చాలా వరకు ఇలాంటి గర్భస్రావాలు తొలి 12 వారాల్లోపే జరుగుతుంటాయి. సాధారణంగా ఈ గర్భ స్రావాలను ఆపలేరు. కడుపులో నొప్పి, యోని నుంచి స్రావాలు, యోని నుంచి టిష్యూ వంటివి రావడం, ప్రెగ్నెన్సీ సంబంధిత లక్షణాలు కనిపించకపోవడం వంటివి గర్భస్రావానికి సంకేతాలు. బ్లీడింగ్ అవడం, లేదా ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పిండం ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు, పిండంలో శిశువుకు ఆక్సిజన్ అందనప్పుడు, హార్ట్ బీట్ లేనప్పుడు గర్భ స్రావం అవుతుంది.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..
ఫలదీకరణ చెందిన అండం గర్భాశయం వెలుపల ఇంప్లాంట్ అవడం లేదా ఫాలోపియన్ ట్యూబ్‌లో ఇంప్లాంట్ అవడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటి సమయాల్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. ఫలదీకరణ చెందిన అండం గర్భాశయం వెలుపల ఇంప్లాంట్ అయినప్పుడు దానిని తొలగించాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స లేదా మందుల ద్వారా తొలగిస్తారు.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి?
కడుపులో దిగువ భాగాన ఒకవైపు నొప్పి రావడం, యోని నుంచి రక్తస్రావం, బ్రౌన్ కలర్‌లో లేదా నీళ్లలా స్రావాలు రావడం, భుజంలో నొప్పి రావడం, మూత్ర విసర్జన సమయంలో లేదా మల విసర్జన సమయంలో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
స్పాటింగ్ అయితే ఈ పరీక్షలు చేస్తారు
స్పాటింగ్ అయినప్పుడు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. బ్లడ్ ప్రెజర్, పల్స్ చూస్తారు. ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేస్తారు. ప్రెగ్నెన్సీ హార్మోన్ స్థాయిని తెలుసుకునే రక్త పరీక్షలు కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేస్తారు. యోని మార్గంలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం ద్వారా పిండం ఎదుగుదలను పరీక్షిస్తారు.
సంబంధిత కథనం