తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kerala Trip । కేరళకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్రదేశాలన్నీ చుట్టిరండి!

Kerala Trip । కేరళకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్రదేశాలన్నీ చుట్టిరండి!

HT Telugu Desk HT Telugu

09 May 2023, 17:05 IST

    • Kerala Trip: మీరు ఈ వేసవి సెలవుల్లో కేరళకు విహారయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే, ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో ఇక్కడ తెలియజేస్తున్నాం.
Kerala Trip
Kerala Trip (Unsplash)

Kerala Trip

Kerala Trip: విహారయాత్రలకు వేసవి చాలా అనుకూలమైన సీజన్. చాలా మంది అనేక అద్భుత ప్రదేశాలలో కుటుంబంతో కలిసి కొన్ని రోజులు గడిపి రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండే వారు ఊటీ, కొడైకెనాల్, కేరళ వంటి ప్రదేశాలకు ట్రిప్ వేయాలనుకుంటారు. కేరళలో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. దేశానికి నైరుతి దిక్కులో ఉన్న కేరళ పచ్చని ప్రకృతి దృశ్యాలు, అందమైన బ్యాక్ వాటర్స్, సహజమైన బీచ్‌లకు నిలయం. కేరళలోని అనేక ప్రదేశాలు భూలోక స్వర్గాలను తలపిస్తాయి. అందుకే కేరళను "గాడ్స్ ఓన్ కంట్రీ" గా అభివర్ణిస్తారు.

ప్రకృతి సౌందర్యానికి, విభిన్న సంస్కృతికి , గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఇది. కేరళలో నియోలిథిక్ యుగం నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు ఈ వేసవి సెలవుల్లో కేరళకు విహారయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే, ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో ఇక్కడ తెలియజేస్తున్నాం.

అలెప్పి బ్యాక్ వాటర్స్

అందామైన కాలువలు, చుట్టూ కొబ్బరి చెట్లతో అనుసంధానం చేసినటువంటి మడుగులు, సరస్సులతో అలెప్పీ అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి దృశ్యాలతో నిర్మలంగా ఉండే ఈ ప్రదేశాన్ని, అలెపీ అందాలను మనసారా అనుభవించడానికి హౌస్‌బోట్ రైడ్ లేదా కానో టూర్‌ని ఆస్వాదించండి.

మున్నార్

తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన మున్నార్ పశ్చిమ కనుమలకు నెలవైన అద్భుతమైన హిల్ స్టేషన్. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి కాలిబాటతో నడవండి, టీ మ్యూజియంను సందర్శించండి లేదా సుందరమైన ప్రకృతి దృశ్యంలో తాజాగా తయారుచేసిన ఒక కప్పు టీని ఆస్వాదించండి.

కోచ్చి

కేరళలో సిటీ లైఫ్ ఆస్వాదించాలనుకుంటే కోచ్చి వెళ్లండి. ఇది నిత్యం సందడిగా ఉండే ఒక ప్రసిద్ధ ఓడరేవు నగరం. కోచ్చి విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల కలయిక. ఈ నగరంలో చారిత్రాత్మక ఫోర్ట్ కోచ్చి, చైనీస్ ఫిషింగ్ నెట్స్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్‌లను సందర్శించండి. అలాగే వీధుల గుండా కలియతిరుగుతూ కేఫ్‌లు, ఆర్ట్ గ్యాలరీలు, మసాలా మార్కెట్‌లను అన్వేషించండి.

వయనాడ్

దట్టమైన పొగమంచు కప్పుకున్న కొండలు, పచ్చని అడవులు, వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన వయనాడ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడ ఎడక్కల్ గుహలను అన్వేషించండి, చెంబ్రా శిఖరం లేదా బాణాసుర సాగర్ ఆనకట్టను సందర్శించండి.

తేక్కడి

తేక్కడిలో ఉన్న పెరియార్ నేషనల్ పార్క్ వన్యప్రాణుల ప్రేమికులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఏనుగులు, పులులు, ఇతర వన్యప్రాణులను గుర్తించడానికి జంగిల్ సఫారీ, బాంబూ రాఫ్టింగ్ లేదా పెరియార్ సరస్సులో బోట్ రైడ్ చేయండి.

కోవలం

పొడవైన ఇసుక బీచ్‌లు, ఎత్తైన తాటి చెట్లతో, కోవలం బీచ్ ప్రేమికులకు, కొత్త జంటలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, ఆయుర్వేద మసాజ్‌లను ఆస్వాదించండి. సాగర తీరంలో సూర్యాస్తమయాలను వీక్షిస్తూ సరదాగా సమయం గడపడానికి కోవలం గొప్ప ప్రదేశం.

కేరళలో చూడదగిన అనేక అద్భుతమైన ప్రదేశాలలో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా పురాతన దేవాలయాలు, సాంస్కృతిక ఉత్సవాలు, సాంప్రదాయ హస్తకళలు , సీఫుడ్ ఇలా ఇక్కడ వీక్షించడానికి, ఆస్వాదించడానికి చాలానే ఉన్నాయి.

టాపిక్