Wayanad Tour । జంటలకు కలల గమ్యస్థానం.. వద్దనకుండా చూసేయండి వయనాడ్!-wayanad is a dreamy destination for couples every honeymooner must visit this place ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wayanad Tour । జంటలకు కలల గమ్యస్థానం.. వద్దనకుండా చూసేయండి వయనాడ్!

Wayanad Tour । జంటలకు కలల గమ్యస్థానం.. వద్దనకుండా చూసేయండి వయనాడ్!

HT Telugu Desk HT Telugu
Apr 06, 2023 10:11 AM IST

Wayanad Tour: పచ్చని అడవి, వన్యప్రాణులు, జలపాతాలు, పురాతన గుహలు ఇవన్నీ చూడాలంటే వయనాడ్ వెళ్లాల్సిందే. కొత్త జంటలకు ఈ ప్రాంతం అద్భుతమైన హనీమూన్ గమ్యస్థానం.

Places To Visit in Wayanad
Places To Visit in Wayanad (Kerala Tourism)

Wayanad Tour: భారతదేశానికి నైరుతి దిశన ఉన్న వయనాడ్ ఒక అందమైన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. దేవతల స్వంత దేశంగా పిలిచే కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైన గ్రామీణ జిల్లా. అనేక ఆకర్షణీయమైన జలపాతాలు, చారిత్రక గుహలు, అధ్యాత్మిక కేంద్రాలకు వయనాడ్ నెలవు. ఈ ప్రాంతం సుగంధ తోటలకు, వైల్డ్ లైఫ్ పార్కుకు ప్రసిద్ధి. ఇక్కడ వన్యప్రాణుల అభయారణ్యం, ఎత్తైన కొండలతో కూడిన పచ్చని అటవీ ప్రాంతం ఉంది. వయనాడ్ అభయారణ్యంలో ఆసియా ఏనుగులు, పెద్ద పులులు, చిరుతపులులు, ఈగ్రేట్‌లతో సహా అనేక రకాల వన్యప్రాణులు ఆవాసం ఉంటున్నాయి. ఇంకా ఇక్కడి అంబుకుతి కొండలలో, ఎడక్కల్ గుహలు పురాతన శిలారాశిలను కలిగి ఉన్నాయి, అందులో కొన్ని నియోలిథిక్ యుగానికి చెందినవి. వీటితో పాటు ఇక్కడ సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి.

వయనాడ్ సందర్శనకు అక్టోబరు నుండి మే వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబరు నుండి ఫిబ్రవరి మధ్య సమయాలు ఉత్తమ సీజన్ అని చెబుతారు. ఈ నెలల్లో ఇక్కడ ప్రాంతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. జంటలతో వెళ్లడానికి వయనాడ్ గొప్ప రొమాంటిక్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. హానీమూన్ జంటలకు ఇది స్వర్గం కంటే ఏమాత్రం తక్కువ కాదు.

Places To Visit in Wayanad- వయనాడ్‌లో చూడదగ్గ ప్రదేశాలు

మీలో ఎవరైనా కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే, వయనాడ్ తప్పకుండా సందర్శించండి, ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయో ఒక లుక్ వేయండి.

బాణాసుర సాగర్ ఆనకట్ట

బాణాసుర పాదాల మీద ఉన్న ఈ ఆనకట్ట చుట్టూ పచ్చదనం ఉంటుంది. వయనాడ్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి. పచ్చదనం మధ్య విశ్రాంతి తీసుకోవాలని కోరుకునే వారు ఇక్కడకు వెళ్లి సేద తీరవచ్చు.

ఎడక్కల్ గుహలు

ఎడక్కల్ గుహలలోని రాతి శిల్పాలు సుమారు 8000 సంవత్సరాల పురాతనమైనవి. నియోలిథిక్ యుగం లేదా లేట్ పాలియోలిథిక్ యుగం నాటివిగా చెబుతారు. ఈ రెండు గుహలు సముద్ర మట్టానికి 3937 అడుగుల ఎత్తులో అంబుకుతి కొండలపై ఉన్నాయి. చరిత్రను అన్వేషించాలనుకునే వారు, పురావస్తు శాస్త్రంపై ముక్కువ ఉన్నవారు, విద్యార్థులు ఈ రహస్య గుహలను తప్పకుండా సందర్శిచాలి. ఈ ప్రదేశం అందాలను అన్వేషించడానికి మీ భాగస్వామితో కలిసి ఇక్కడకు వెళ్లండి.

చెంబ్రా శిఖరం

వయనాడ్ పర్వత శ్రేణులలో చెంబ్రా సముద్ర మట్టానికి 6890 అడుగుల ఎత్తులో ఉన్న ఎత్తైన శిఖరం. ఈ ప్రదేశం సుందరమైన పచ్చని దృశ్యాలను కలిగి ఉంది, ఇది ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది.

సూచిపర జలపాతాలు

వెల్లరిమల వద్ద మూడు అంచెల సూచిపర జలపాతం ఉంది. దీనిని సెంటినెల్ రాక్ వాటర్‌ఫాల్ అని కూడా పిలుస్తారు, ఇది వాయనాడ్‌లోని ఒక సుందరమైన ప్రదేశం. పచ్చని అడవులు, భారీ రాళ్ల మధ్య 656 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతం పారుతున్న దృశ్యం చూస్తే మీ గుండె జారి గల్లంతవడం ఖాయం.

ఇరుప్పు జలపాతం

బ్రహ్మగిరి కొండల నుండి ప్రవహిస్తూ, చుట్టూ గంభీరమైన పశ్చిమ కనుమలు మధ్య జాలువారే ఇరుప్పు జలపాతాలు సందర్శికులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రకృతి ప్రేమికులకు, పక్షి ప్రేమికులకు ఇది గొప్ప ఆనందాన్ని కలిగించే ప్రదేశం.

Whats_app_banner

సంబంధిత కథనం