Jatinga Bird Mystery | ఆ ప్రాంతంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం!-mysterious suicide of birds in jatinga village know the story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jatinga Bird Mystery | ఆ ప్రాంతంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం!

Jatinga Bird Mystery | ఆ ప్రాంతంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం!

Manda Vikas HT Telugu
Apr 06, 2023 10:13 AM IST

Jatinga Bird Mystery: మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఉంటాయి, మరి పక్షులకు ఏం ఉంటాయి. ఆ ప్రాంతం ఒక అంతుచిక్కని రహస్యం. ఈ స్టోరీ చదవండి.

Jatinga Bird Mystery
Jatinga Bird Mystery (Unsplash)

ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి బ్రతికేందుకు బ్రతుకు పోరాటం చేస్తాయి. అయితే మనిషి మాత్రం ఈ పోరాటంలో కొన్నిసార్లు ఓడిపోయినట్లుగా భావించి బలవన్మరణానికి పాల్పడతాడు. మనిషులు ఆత్మహత్య చేసుకోవడం చాలా సాధారణ విషయం. మరి మనిషి కాకుండా మరేఇతర జీవి ఆత్మహత్య చేసుకుంటుందా? ఈ సందేహానికి సమాధానం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పరిశోధనలు, నివేదికల ప్రకారం, మనిషి కాకుండా ఏ జీవి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. కొన్ని జంతువులు దుఃఖం లేదా ఒత్తిడి అనుభవిస్తున్న సమయంలో ఆహారం తినడానికి నిరాకరిస్తున్న కథలు ఉన్నాయి. అలాగే కొన్ని కీటకాలు తమను తాము త్యాగం చేయడం ద్వారా తమ కాలనీని రక్షించుకుంటాయని నివేదికలు తెలిపాయి. ఇప్పుడు మీకు మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తున్నాం.

వివరాల్లోకి వెళ్తే, ఈశాన్య భారతదేశంలో ఒక రాష్ట్రమైన అస్సాంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన హిల్ స్టేషన్లకు చాలా ప్రసిద్ధి. ఇక్కడి డిమా హసావో జిల్లాలో హఫ్లాంగ్‌కు దక్షిణాన దాదాపు తొమ్మిది కి.మీ దూరంలో జటింగా అనే కుగ్రామం ఉంది. ఇది పక్షి వీక్షణకు ఒక అద్భుతమైన ప్రదేశం, ఎన్నో వేల రకాల పక్షులను చూడటానికి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అయితే సుందరమైన గ్రామం అయిన ఈ జటింగా ఒక విచిత్రమైన అంశంలో చాలా ప్రసిద్ధి పొందింది. అదేమిటంటే, 'పక్షి ఆత్మహత్యలు'! ఈ గ్రామంలో ఒక నిర్ణీత సమయంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి, ఆశ్చర్యంగా ఉంది కదూ.

Jatinga Bird Mystery - అంతుచిక్కని రహస్యం

సాధారణంగా అనేక భౌగోళిక ప్రాంతాల నుండి ఏదైనా ప్రత్యేకమైన సీజన్‌లో పక్షులు వలస వస్తాయి, అవి జతకట్టడానికి, గుడ్లు పెట్టడానికి లేదా ఆహారం కోసం వచ్చి, ఆ సీజన్ ముగియగనే తిరిగి వెళ్లిపోవడం గురించి మీకు తెలిసిందే. అయితే జటింగాకు మాత్రం పక్షులు ఆత్మహత్య చేసుకోవడానికే వలస వస్తున్నాయని కథనాలు ఉన్నాయి. ఆగస్ట్ నుండి నవంబర్ నెలల మధ్య ఇక్కడికి వలసే వచ్చే పక్ష్లులు ఆకాశం నుండి దూకేస్తున్నట్లుగా నేలమీద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. చాలా మంది పక్షి శాస్త్రజ్ఞులు, పర్యాటకులు ఈ వింతను చూడటానికే ఏటా ఇక్కడకు వస్తున్నారంటే నమ్ముతారా? ఇక్కడి గిరిజన ప్రజలు ఒక కొండ ప్రాంతంలో ఏదో దుష్టశక్తి ఉందని అందుకే పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయని బలంగా విశ్వసిస్తారు. జటింగాను పక్షుల మృత్యులోయ (Valley of Death) గా కూడా అభివర్ణిస్తారు.

అంతుచిక్కని రహస్యం వెనక కారణం ఏమయ్యుంటుందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేశారు. ఈ ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది, పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ కొండలపై అధిక ప్రకాశం గల సెర్చ్‌లైట్‌లను అమర్చారు, ఇక్కడి ఇండ్లను గిరిజనులు పొడవైన వెదురుబొంగులతో నిర్మించుకుంటారు. అధిక ప్రకాశం గల లైట్లకు పక్షులు ఆకర్షితం అవుతున్నాయి, పొగమంచులో అయోమయం చెంది పక్షులు వెదురుబొంగులకు వచ్చి గాయపడుతున్నాయి, అందుకే పక్షి మరణాలు సంభవిస్తున్నాయి అని పర్యావరణవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని సందేహాలకు జవాబులు లేకపోవడం వలన ఆ నమ్మకం అలాగే కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే, జటింగా ఒక ఉత్తమమైన ఆఫ్‌బీట్ గమ్యస్థానం సందర్శకులు ఈ ప్రాంతంలోని రెండవ ఎత్తైన శిఖరం హెంప్యూపేట్ శిఖరాన్ని చూడవచ్చు. ప్రాంతీయ ప్రత్యేకతలు, గిరిజన నృత్యాలను కూడా ఆస్వాదించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం