Bird Walk | పక్షి ప్రేమికుల కోసం కవాల్ రిజర్వ్‌లో తొలిసారిగా బర్డ్ వాక్ ఈవెంట్‌-kawal tiger reserve to host bird walk on february 12 13 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kawal Tiger Reserve To Host Bird Walk On February 12 & 13

Bird Walk | పక్షి ప్రేమికుల కోసం కవాల్ రిజర్వ్‌లో తొలిసారిగా బర్డ్ వాక్ ఈవెంట్‌

Manda Vikas HT Telugu
Feb 11, 2022 02:59 PM IST

Bird Walk at Kwal Reserve | కవాల్ రిజర్వ్‌లో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు జరిగే ఈ బర్డ్ వాక్ ఉత్సవంలో పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు పాల్గొంటున్నారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

Bird Walk Event
Bird Walk Event (AP)

Kawal Tiger Reserve | కవాల్ టైగర్ రిజర్వ్ ఫిబ్రవరి 12, 13 తేదీలలో తొలిసారిగా 'బర్డ్ వాక్' ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. వందల జాతుల పక్షులను ఒక చోట వీక్షించాలనుకునే ఔత్సాహికులు అలాగే తెలంగాణ అటవీసంపద, జీవవైవిధ్యాన్ని ఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రేమికులు ఈ వారాంతంలో ప్రకృతి ఒడిలో గడిపే అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా టూరిజం శాఖ కోరుతోంది. కవ్వాల్ రిజర్వ్‌లో దాదాపు 300కు పైగా పక్షి జాతులు ఉన్నాయి. అలాగే చిరుతలు, తోడేళ్లు, మచ్చల జింకలు, వేట కుక్కలు మొదలగు వైవిధ్యమైన వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అంతేకాకుండా 600 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. ముఖ్యంగా స్వచ్ఛమైన టేకు, స్వచ్ఛమైన వెదురు వృక్షాలతో పాటు ఎన్నో ఔషధ మొక్కలు, అందగా పారే సెలయేళ్లు, రమ్యమైన కొండలు, వాటి మధ్యలో సుందరమైన చెరువులు ఉన్నాయి.

ఇక రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు జరిగే ఈ బర్డ్ వాక్ ఉత్సవంలో పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు పాల్గొంటున్నారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ఫిబ్రవరి 12న ఉదయం 11 గంటలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి పేర్లను నమోదు చేసుకొని గ్రూపులుగా విభజిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం రూ. 1500/- ఛార్జ్ ఉంటుంది. ఇందులో భాగంగా అటవీ శాఖ గెస్ట్ హౌజ్ లో వసతి, ఆహారం, రవాణా వసతులు కల్పిస్తారు.

మధ్యాహ్నం భోజనం అనంతరం వీరిని అడవిలోకి తీసుకెళ్లి, బేస్ క్యాంపుల్లో వారికి వసతి ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 4:30 గంటలకు బర్డ్ వాక్ కార్యక్రమం మొదలవుతుంది. నార్త్ పింటైల్స్, యురేషియన్ వైజన్స్, గద్వాల్, గార్గేనీ మొదలైన వలస పక్షులను అన్వేషించడానికి ఇది సరైన సమయం అలాగే గ్రే-హెడ్ ఫిష్ డేగ, క్రెస్టెడ్-ట్రీ స్విఫ్ట్, రివర్-ల్యాప్ వింగ్, వైట్-రంప్డ్ మునియా, బ్లాక్ కొంగ లాంటి అరుదైన పక్షులను కూడా చూసే అవకాశం కలుగుతుంది.

తిరిగి సాయంత్రం 6:30 గంటలకు బేస్ క్యాంప్‌కు తీసుకొస్తారు, 7:30 నుంచి అడవిలో క్యాంప్ ఫైర్, ఇతర కార్యక్రమాల తర్వాత అక్కడే డిన్నర్ ఏర్పాట్లు చేస్తారు. మళ్లీ ఉదయం 5:30 గంటలకు మరోసారి అడవిలోకి తీసుకెళ్లి పక్షుల వీక్షణంకు అవకాశం ఇస్తారు. ఉదయం 8:30కి అక్కడే అల్పాహారం, తిరిగి 10:30కు కార్యక్రమం ముగింపు ఉంటుంది. మధ్యాహ్నం 2:30కి లంచ్ తర్వాత కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. వివరాల కోసం ఫారెస్ట్ ఆఫీసర్, ఇందన్‌పల్లి నెంబర్ 99487-51980 తో ఫోన్‌లో సంప్రదించవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం