Into the Woods | తెలంగాణ కాశ్మీరం.. ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలకు గమ్యస్థానం!
తెలంగాణ కాశ్మీర్‌గా, దక్షిణ భారత ముఖద్వారం (Gateway of South India) గా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి రమణీయతను, ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక ప్రభను, ఆధ్యాత్మిక శోభను గురించి వర్ణించాలంటే మాటలు సరిపోవు. మాన్‌సూన్ రాకతో ఈ ప్రాంతం మరింత శోభాయమానంగా మారింది.
ఎటు చూసినా దట్టమైన పచ్చని అభయారణ్యాలు, పక్షుల కిలకిల రాగాలు, కొండల నుంచి జలజల జాలువారే జలపాతల సవ్వడులు, వాగులు -వంకలు, విజ్ఞానజ్యోతులు వెలిగించే దేవాలయాలు, గోండు గుస్సాడి నృత్యాలు ఇది క్లుప్తంగా ఆదిలాబాద్ జిల్లా నిర్వచనం. తెలంగాణ కాశ్మీర్‌గా, దక్షిణ భారత ముఖద్వారంగా పేరుగాంచిన ఆదిలాబా జిల్లా ప్రకృతి రమణీయతను, ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక ప్రభను, ఆధ్యాత్మిక శోభను గురించి వర్ణించాలంటే మాటలు సరిపోవు. ఇక్కడకు వచ్చి చూడాల్సిందే. వర్షాకాలం రాకతో ఇక్కడి నేలంతా పచ్చని రంగేసుకుంది.

పరిపాలన సౌలభ్యం కోసం ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలుగా విభజించారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూడదగ్గ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడకు ఎలా చేరుకోవచ్చు, ఎక్కడ విడిది చేయవచ్చు మొదలగు అన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాకు రైలు మార్గం ఉన్నప్పటికీ అది ఏ ప్రాంతాన్ని కవర్ చేయనట్లుగా ఉంది. కాబట్టి రోడ్డు మార్గంలో ప్రయాణమే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. NH 44 ద్వారా హైదరాబాద్ వయా మేడ్చల్ మీదుగా నాగ్ పూర్ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది.
పకృతి దృశ్యాలు: కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు, కవ్వాల్ అభయారణ్యం, కడెం రిజర్వాయర్
నిర్మల్- ఆదిలాబాద్ మార్గంలో రెండు జలపాతాలను చూడవచ్చు. నిర్మల్ నుంచి సుమారు 40-50 కిమీ దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. బైపాస్ రోడ్డు కాకుండా రెగ్యులర్ రోడ్డు మీదుగా వెళ్తే నిర్మల్ దాటగానే ఘాట్ రోడ్డు వస్తుంది. వీటిని మెహబూబ్ ఘాట్లు అని పిలుస్తారు. మెలితిరిగి ఉండే ఈ ఘాట్లలో ప్రయాణం ఓ చక్కని అనుభూతి. ఇక్కడ కాసేపు ఆగి చుట్టూ ఉండే ప్రకృతి రమణీయతను ఆస్వాదించవచ్చు. మార్గమధ్యంలో కూడా చిన్నచిన్న సెలయేళ్లు, జలపాతాలు కనువిందు చేస్తాయి.
ఇక కుంటాల జలపాతం నేరడిగొండ మండంలంలో ఉంటుంది. ఎంతో ఎత్తునుంచి రెండు పాయలుగా జాలువారే కుంటాల జలపాతం అద్భుత దృశ్యంగా అనిపిస్తుంది. మరోవైపు దీనికి దగ్గర్లోనే బోథ్ మండలంలో పొచ్చెర జలపాతం ఉంటుంది. చుట్టూపంటపొలాలు, మధ్యలో జలపాతం కనువిందు చేస్తుంది. ఈ ప్రదేశాలలో తినటానికి దాబాలు చాలానే ఉన్నాయి కానీ బస చేయడానికి సరైన వసతులు లేవు. తిరిగి నిర్మల్ చేరుకొని బస చేయాల్సి ఉంటుంది.
బోథ్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉండే కైలాష్ టెక్డి అనే ప్రాంతం కొండకోనలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అరణ్యాలు, నడుమ ఎత్తైన కొండపై శివాలయం మిమ్మల్ని మరో ప్రప్రంచంలోకి తీసుకెళ్తుంది.
నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి తూర్పు వైపు (మంచిర్యాల వైపు) ప్రయాణిస్తే కడెం రిజర్వాయర్, గాయత్రీ జలపాతం కవ్వాల్ అభయారణ్యం చేరుకోవచ్చు. కడెం రిజర్వాయర్ లో బోటింగ్ చేయొచ్చు, దగ్గర్లోనే గాయత్రీ జలపాతం ఉంటుంది. ఆ తర్వాత కవ్వాల్ అభయారణ్యంలో ఎన్నో రకాల పక్షులు, వన్యప్రాణులను చూడవచ్చు. జంగల్ సఫారీ కూడా చేయవచ్చు. ఈ ప్రదేశాలలో బస చేయడానికి హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. దారిపొడగునా చెట్ల నుంచి సేకరించే తియ్యని సహజసిద్ధమైన తాటి కల్లు, ఈతకల్లును కూడా రుచిచూడటం మరిచిపోవద్దు.
ఆధ్యాత్మిక కేంద్రాలు: బాసర సరస్వతీ దేవాలయం, జైనథ్ సూర్య దేవాలయం
నిర్మల్ జిల్లా కేంద్రానికి పశ్చిమాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో బాసర జ్ఞానసరస్వతి దేవాలయం ఉంది. గోదావరి నదీతీరాన ఉన్న ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలో ఉన్న రెండు ప్రసిద్ద శారదా పీఠాలలో ఒకటి. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటే వారికి విద్యాబుద్ధుల్లో తిరుగుండదని, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని భక్తుల నమ్మకం. బాసరకు వివిధ ప్రాంతాల నుంచి నేరుగా రైలు, బస్సు సర్వీసులున్నాయి. బస చేయడానికి కూడా మంచి వసతి సౌకర్యాలు ఉన్నాయి.
ఆదిలాబాద్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో జైనథ్ దేవాలయం ఉంది. ఈ దేవాలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది దేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి. దీనిని 4 నుంచి 9 శతాబ్దం మధ్యకాలంలో పల్లవ వంశాంకి చెందిన రాజు నిర్మించినట్లు ప్రతీతి. ఇక్కడి ప్రాకృతి శిల్లల్లో ఉన్న 20 సంస్కృత శ్లోకాలు పల్లవుల గురించి చెబుతాయి. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరి ఉన్నాడు. ప్రతీ ఏడాది కార్తీక సుద్దాష్టమి నుండి బహుళ సప్తమి (అక్టోబర్-నవంబర్) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
సంబంధిత కథనం