తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kerala Tour | కేరళ హౌజ్ బోట్లలో విహరించాలనుందా? టూర్ గైడ్ మీకోసం..

Kerala Tour | కేరళ హౌజ్ బోట్లలో విహరించాలనుందా? టూర్ గైడ్ మీకోసం..

28 February 2022, 14:28 IST

google News
    • కేరళ హౌజ్ బోట్లలో విహారం.. ఆ మజాయే వేరు. సీ బ్యాక్ వాటర్‌లో ప్రకృతి ఒడిలో పూర్తి ప్రైవసీ, స్థానిక భోజనంతో కూడిన విహారం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. కేరళ టూర్‌లో హౌజ్ బోట్ విహారం ఎక్కడ చేయాలి? ఎంత ఖర్చవుతుంది? ఏ సీజన్ బాగుంటుంది వంటి వివరాలన్నీ తెలుసుకుందాం రండి.
హౌజ్ బోట్
హౌజ్ బోట్ (kerala tourism)

హౌజ్ బోట్

హౌజ్ బోట్ విహారం అంటేనే ప్రత్యేకం. అందులో సీ బ్యాక్ వాటర్‌లో హౌజ్ బోట్ విహారం కేరళకు ప్రత్యేకం. ఒకప్పుడు వస్తు రవాణాకు ఉపయోగించిన కెట్టువల్లమ్‌లను కేరళలో ప్రస్తుతం అందంగా ముస్తాబు చేసి విహార యాత్రలకు ఉపయోగిస్తున్నారు. వస్తుసముదాయాన్ని మలయాళంలో కెట్టు అని, బోటును వల్లమ్ అని పిలుస్తారు. కొబ్బరిపీచు, జాక్ కలప, జీడి గింజలు ఉపయోగించి ఈ విహార పడవలను తయారు చేస్తారు. కప్పు వేసేందుకు వెదురు చాపలు, పోక చెక్క కలపను వినియోగిస్తారు. కొబ్బరి చెట్ల కలపను ఫ్లోరింగ్ కోసం ఉపయోగిస్తారు. విద్యుత్తు అవసరాల కోసం సౌర విద్యుత్తు వినియోగిస్తున్నారు.

ఈ విహార పడవల్లో హోటళ్ల తరహాలోనే బెడ్ రూమ్, అత్యాధునిక టాయిలెట్, అందమైన లివింగ్ రూమ్, కిచెన్ కూడా అందుబాటులో ఉంటాయి. అలప్పురా హౌజ్‌బోట్లకు ప్రసిద్ధి. ఇక్కడే సుమారు 500 బోట్లు ఉంటాయి. ఇక తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిసూర్, కాసర్‌గోడ్, కొల్లం, కొట్టాయం కూడా హౌజ్ బోట్లకు ప్రసిద్ధి.

ఛార్జీలు ఎలా ఉంటాయి?

హౌజ్ బోట్లలో వసతులను బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. హౌజ్ బోట్‌లో 8 మందికి ఒక్కో రోజుకు రూ. 20 వేల వరకు వసూలు చేసే సంస్థలు ఉన్నాయి. డిసెంబరు 20 నుంచి జనవరి 10 వరకు రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ఈ కాలంలో ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా చెక్ ఇన్ మధ్యాహ్నం 12కు మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చెక్ అవుట్ ఉంటుంది. ఒక్కో సంస్థ ఒక్కో రీతిలో వ్యవహరిస్తుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవ్‌నింగ్ స్నాక్స్, డిన్నర్ ఆయా హౌజ్ బోట్ నిర్వాహకులు సమకూరుస్తారు. సీ బ్యాక్ వాటర్‌లో లభించే తాజా చేపలను కూడా వండి ఆహారంగా అందిస్తారు. ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై కూడా అందుబాటులో ఉంటాయి. డిన్నర్‌లో ఫింగర్ ఫిష్ వంటి వంటకాలు అందిస్తారు.

లగ్జరీ హోటళ్లను తలపించే ఈ హౌజ్ బోట్లలో ప్రయాణం చేస్తూ కేరళ గ్రామీణ వాతావరణాన్ని చూడొచ్చు. హౌజ్ బోట్లను బుక్ చేసుకోవాలంటే స్థానిక జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ (డీటీపీసీ) అధీకృత ప్రీపెయిడ్ కౌంటర్లలో చేసుకోవాలి.

హౌజ్ బోట్లను బుక్ చేసుకునేముందు రెండు అంశాలు తప్పక గుర్తుంచుకోవాలి. సముద్ర జలాలైనందున హౌజ్ బోట్లలో పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి రక్షణకు ఆయా హౌజ్ బోట్లు తీసుకున్న చర్యలేంటో అడగండి. అలాగే హౌజ్ బోట్‌లో ప్రైవసీ మరో సమస్య. తగిన రీతిలో ప్రైవసీ ఉంటుందా లేదా గమనించాలి.

తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు రైలు, విమానయాన సౌకర్యం విస్తృతంగా అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లో టూర్ ప్లాన్ చేసేవారు కేరళ టూర్‌ను పరిశీలించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం