వైజాగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? పర్యాటకులకు రైల్వేస్టేషన్‌లోనే అద్దెకు బైక్‌లు
24 January 2022, 20:28 IST
- విశాఖ నగరం, చుట్టుపక్కల అందాలను సందర్శించేందుకు ఏపి టూరిజం సహా ఎన్నో ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి.
- వాల్తేర్ డివిజన్ వారు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం బైక్స్, కార్లు అద్దెకు ఇచ్చే విధానాన్ని ఇటీవల ప్రారంభించారు.
Visakhapatnam in Andhra Pradesh greets us with blowing winds from the Eastern Ghats and the smell of the ocean from the coast of Bay of Bengal.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అతిపెద్ద నగరంగానే కాకుండా ప్రముఖ ఓడరేవు పట్టణంగా, పారిశ్రామిక కేంద్రంగా పేరుంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే ఈ నగరం పర్యాటకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. సువిశాలమైన బంగాళాఖాతం తీరప్రాంతం, ఆహ్లదాన్ని పంచే బీచ్ ప్రాంతాలు వైజాగ్ సిటీకి ప్రధాన ఆకర్షణ. విశాఖ అందాలను వీక్షించేందుకు ఆంధ్రా, తెలంగాణలతో పాటు ఒడిశా, ఛత్తీస్ ఘర్, పశ్చిమబెంగాల్ మొదలగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
ప్రసిద్ధ ప్రదేశాలు
నగరంలోని రామకృష్ణ బీచ్, రుషికొండ, యారాడ బీచ్‌లతో పాటు కైలాసగిరి, విశాఖ మ్యూజియం, కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, జూపార్క్ తదితర ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఆసక్తికనబరుస్తారు. అలాగే సింహాచలం, కాళీ దేవాలయం, తాట్లకొండ, బావికొండ లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు విశాఖకు మణిహారంగా ఉన్నాయి.
అంతేకాకుండా ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయ, బొర్రా గుహాలు, లంబసింగి లాంటి హిల్ స్టేషన్స్ విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలకైతే పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. వైజాగ్ వచ్చిన వారు కచ్చితంగా అరకును సందర్శించకుండా వెళ్తే అది ఒక లోటుగానే మిగిలిపోతుంది.
ప్రత్యేక ప్యాకేజీలు..
కాగా, విశాఖ నగరం, చుట్టుపక్కల అందాలను సందర్శించేందుకు ఏపి టూరిజం సహా ఎన్నో ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చే చాలా మంది యాత్రికులు బస్సు, క్యాబ్, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వాటి కోసం ఎదురుచూసి సమయం వృథా చేసుకోవడం గమనించిన ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన వాల్తేర్ డివిజన్ వారు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం బైక్స్, కార్లు అద్దెకు ఇచ్చే విధానాన్ని ఇటీవల ప్రారంభించారు. ప్రముఖ మోటార్ రెంటల్స్ 'Mr Bikes' అనే కంపెనీ భాగస్వామ్యంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో గేట్ నంబర్ 1 వద్ద ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
వాహనాలు అద్దెకు దొరుకుతాయి
ఇష్టమైన బైక్‌లను అద్దెకు తీసుకోని వైజాగ్ సిటీతో పాటు అరకు, లంబసింగి తదితర ప్రాంతాలకు కొన్ని రోజుల పాటు లాంగ్ రైడ్‌కు కూడా వెళ్లవచ్చు. కావాల్సిన బైక్ కోసం వారం రోజుల ముందునుంచే ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు. పెట్రోల్ తో నడిచే స్కూటీ లాంటి వాహనం రోజుకి రూ. 500/- కే లభిస్తుండగా. పల్సర్- రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్స్ కు రోజుకు రూ. 600 నుంచి రూ. 1200 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఆధార్ కార్డ్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి కావాల్సిన బెక్ పొందవచ్చు.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కోసం నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ మోటార్ రెంటల్స్ ట్రావెల్ చేయటానికి ఎంతో అనువైనవిగానే కాకుండా, ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో వైజాగ్ టూర్ కోసం వచ్చే యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింకేం, మీరూ ఓసారి వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకోండి.