తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know About The New Fitness Trend Plogging That Can Benefit You And The Environment

Plogging | జాగింగ్ చేస్తున్నారా? కొత్తగా ప్లాగింగ్ చేయండి.. ఇప్పుడిదే ట్రెండ్!

HT Telugu Desk HT Telugu

04 May 2022, 6:48 IST

    • జాగింగ్ అందరూ చేసేదే ప్లాగింగ్ చేస్తే మీరు నలుగురిలో ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం- పరిశుభ్రత రెండూ సాధ్యమవుతాయి. మరి ప్లాగింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి..
Plogging
Plogging (Unsplash)

Plogging

ఈమధ్య కాలంలో అర్బన్ ప్రాంతాలలో కొత్తకొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌లు పరిచయం అవుతున్నాయి. ఇందులో ప్లాగింగ్ అనే ఫిట్‌నెస్ ట్రెండ్‌ విపరీతమైన ప్రాచుర్యం పొందింది. మీకు జాగింగ్ అంటే తెలుసు మరి ఈ ప్లాగింగ్ ఏంటి అనుకుంటున్నారా? ప్లాగింగ్ అనేది రెండు పదాల కలయిక. అవి జాగింగ్ ఇంకా ప్లోకా అప్. ఇక్కడ ప్లోకా అప్ అనేది స్వీడిష్ పదం, ఇంగ్లీషులో అనే అర్థాన్ని సూచిస్తుంది. మరి పికప్ అంటే తెలిసిందే పిక్ చేయడం, ఎత్తడం, సేకరించడం లాంటి అర్థాలు వస్తాయి.

మీరు జాగింగ్ చేస్తూనే మీకు దారిలో కనిపించే చెత్తను సేకరించి డస్ట్ బిన్‌లో వేయడం, పరిసరాలను పరిశుభ్రం చేసుకుంటూ పోవడం చేయాలి. దీనిని ప్లాగింగ్ అంటారు. స్వీడన్‌కు చెందిన ఎరిక్ అహ్ల్‌స్ట్రోమ్ అనే వ్యక్తి ప్రతిరోజూ జాగింగ్ చేస్తూ తన దారి వెంట ఉండే చెత్తను శుభ్రం చేస్తూ వెళ్లేవాడు. ఇదేమని అడిగితే 'ప్లాగింగ్' అని వివరించాడు. దీంతో ఈయన చర్య పలువురిని ఆకర్షించి, వారిని అనుకరించేలా ప్రేరేపించింది. ఈ ట్రెండ్ అలా అలా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.

ప్లాగింగ్ అనేది పర్యావరణ హితమైన వ్యాయామం. ప్రతిరోజూ ప్లాగింగ్ చేయడం ద్వారా ప్రజలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. 

ప్లాగింగ్ ద్వారా కలిగే మరికొన్ని ప్రయోజనాలు:

  • ఇంట్లో వ్యాయామం చేయడం కన్నా ఆరు బయట ప్రకృతిలో జాగింగ్ చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్లాగింగ్ చేయడం వలన జాగింగ్‌కి అదనపు వ్యాయామంలా ఉంటుంది. మీరు చెత్త కోసం వంగడం- లేవడం. చెత్తను వేరే చోటికి తరలించడం వలన మీ శరీరానికి వివిధ రకాల వ్యాయామాలు ఒకేసారి జరుగుతుంది.
  • స్క్వాట్, బెండ్ లేదా స్ట్రెచ్ ఇలా మీరు కోరుకున్న విధంగా మీ శరీరాన్ని వంచుతూ చెత్తను సేకరించండి. ప్లాగింగ్ ద్వారా మీ రొటీన్ వ్యాయామంలో భిన్నత్వం కనిపిస్తుంది. మీ శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.
  • జాగింగ్ ద్వారా ఆరోగ్యం కలిగితే,  ప్లాగింగ్ ద్వారా స్వచ్చత కలుగుతుంది. ఇది మీలో సామాజిక స్పృహను పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  • సాధారణ జాగింగ్‌తో పోలిస్తే ప్లాగింగ్‌ ఎంతో ప్రత్యేకమైనది. ఇది ప్రజలందరికి వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పర్యావరణ సంరక్షణ బాధ్యతను గుర్తుచేస్తుంది. ప్లాగింగ్ చేసే వారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.

ఇంకా మనకు తెలియని ఎన్నెన్నో ప్రయోజనాలు ప్లాగింగ్ ద్వారా కలుగుతాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. చెత్తను సేకరించేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతికి గ్లౌజులు వేసుకోవాలి. ప్లాగింగ్ చేసి వచ్చిన తర్వాత మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.

టాపిక్