Idli- Dosa Breakfast | ఒకేసారి రెండు రుచులు ఆస్వాదించండి.. డబుల్ ఆనందం పొందండి!
26 September 2022, 7:15 IST
- Idli- Dosa Combo Recipe: ఇంట్లోనే రుచికరంగా ఇడ్లీ- దోశ ఒకేసారి తినాలనుకుంటే ఈ కాంబో రెసిపీని ట్రై చేయండి. ఒకేసారి రెండు రుచులను ఆస్వాదించండి.
Idli- Dosa Combo Recipe
బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనుకోగానే మనకు సాధారణంగా ఇడ్లీ, దోశలు గుర్తుకొస్తాయి. ఒకరోజు రోజు ఇడ్లీ, మరొక రోజు దోశ ఇలా తింటూ ఉంటాం. మరి ఒకేరోజు రెండు రకాల అల్పాహారం ఎందుకు తినకూడదు? అందుకు సమయం లేదనుకుంటున్నారా? లేక రెండూ ఒకేసారి చేయాలంటే అది చాలా పెద్ద ప్రక్రియ అని భయపడుతున్నారా? అయితే మీరు ఒక చిన్న చిట్కా పాటిస్తే ఇడ్లీ, దోశ రెండు ఒకేరోజు ఒకే సమయంలో చేసుకొని తినొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మనకు ఇడ్లీలు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు, దోశలు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు కాస్త అటూ ఇటుగానే ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికి సరిపోయేలా బ్యాటర్ సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు, ఈ బ్యాటర్ ను మీరు వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వచేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి సిద్ధం చేసుకుంటే వారంలో ఎప్పుడైనా సరే, త్వరగా ఇడ్లీ లేదా దోశ చేసుకోవచ్చు. లేదా రెండూ కూడా చేసుకోవచ్చు. మీకు ఈరోజు ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీకి బదులుగా వారం రోజుల అల్పాహారానికి సరిపోయే బ్యాటర్ రెసిపీని అందజేస్తున్నాం. ఆ టూ-ఇన్-వన్ బ్యాటర్ కోసం కావలసిన పదార్థాలేమిటి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
Idli- Dosa Combo Recipe కోసం కావలసినవి
- 2 కప్పుల ఇడ్లీ బియ్యం
- 1 కప్పు మినుప పప్పు
- 1 కప్పు అటుకులు (మందపాటి)
- 1/4 టీస్పూన్ మెంతులు
- 1/2 టీస్పూన్ ఉప్పు
- 2-3 టీస్పూన్ల నూనె
ఇడ్లీ- దోశ కాంబో బ్యాటర్ తయారీ
- ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ బియ్యం, మినపపప్పు, అటుకులు, మెంతులు తీసుకొని బాగా కడిగి, సరిపడా నీరు పోసి ఒక 4 గంటలు నానబెట్టండి.
- ఆపై ఈ మిశ్రమాన్ని మృదువైన ఆకృతి వచ్చేంతవరకు అవసరం మేరకు నీళ్లు కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఈ బ్యాటర్‌ను 8 గంటల పాటు పక్కనబెట్టి పులియటానికి అవకాశం ఇవ్వండి.
- ఇప్పుడు మీకు కావలసిన బ్యాటర్ సిద్ధమైనట్లే. రుచికోసం అవసరమైతే కొద్దిగా ఇందులో ఉప్పు కలుపుకోండి.
- ఈ బ్యాటర్ తో మీరు ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు.
ఇంట్లోనే ఒకేసారి ఇలా ఇడ్లీ, దోశ చేసుకొని తినండి. రుచి-శుచి రెండూ ఉంటాయి.