తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మాడిపోయిన మసాల దోశ ఇంకెన్నాళ్లు తింటారు, చాక్లెట్ దోశతో తియ్యని వేడుక చేసుకోండి!

మాడిపోయిన మసాల దోశ ఇంకెన్నాళ్లు తింటారు, చాక్లెట్ దోశతో తియ్యని వేడుక చేసుకోండి!

Manda Vikas HT Telugu

28 February 2022, 18:07 IST

    • మీరు ఇప్పటివరకు మసాల దోశ, కారం దోశ, ఉల్లిదోశ, రవ్వ దోశ, పనీర్ దోశ అంటూ దోశల్లో ఎన్ని వైరైటీ ఉన్నాయో అవన్నీ రుచి చూసి ఉండొచ్చు. కానీ అవి రొటీన్, పరమ బోర్ కూడా. అయితే మీరిప్పటివరకు రుచి చూడని ఇంకో కొత్తరకం వెరైటీ దోశను మీకు పరిచయం చేస్తున్నాం.. అదే 'చాక్లెట్ దోశ'!
Chocolate Dosa
Chocolate Dosa (HT Photo)

Chocolate Dosa

దోశ  మనలో చాలామందికి ఇష్టమైన టిఫిన్. మీరు ఇప్పటివరకు మసాల దోశ, కారం దోశ, ఉల్లిదోశ, రవ్వ దోశ, పనీర్ దోశ అంటూ దోశల్లో ఎన్ని వైరైటీలు ఉన్నాయో అవన్నీ రుచి చూసి ఉండొచ్చు. అవన్నీ రొటీన్, పరమ బోర్ కూడా. కానీ మీరిప్పటివరకు రుచి చూడని ఇంకో కొత్తరకం వెరైటీ దోశను మీకు పరిచయం చేస్తున్నాం.. అదే 'చాక్లెట్ దోశ'! అవును చాక్లెట్ దోశ ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతుంది. మీ రోజును ఇప్పుడు మిఠాయితో ఆరంభించాలంటే, మీరు తియ్యని వేడుక చేసుకోవాలంటే చాక్లెట్ దోశ (Chocolate Dosa మీకోసం వేడివేడిగా సిద్ధంగా ఉంటుంది. ఇకపై మీరు మీ ఇష్టమైన వారికి మీ ప్రేమను చాక్లెట్ కు బదులుగా చాక్లెట్ దోశతో వ్యక్తపరచవచ్చు.

మరి ఈ చాక్లెట్ దోశ ఎక్కడ దొరుకుతుందీ అంటే? తమిళనాడులోని కొన్ని రెస్టారెంట్లలో ఈ దోశ లభిస్తుంది. మీరు ఇంట్లోనే ఉండి కూడా ఈ దోశను తయారు చేసుకోవటానికి దీని రెసిపీని మీకు అందిస్తున్నాం. ఇందుకోసం మీకు కావాల్సిందల్లా దీనిని తయారు చేసేందుకు అవసరమయ్యే పదార్థాలతో పాటు, గుండెల్లో కొంచెం దమ్ము.

చాక్లెట్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు దోశ పిండి (ఉప్పు లేకుండా)

2 టేబుల్ స్పూన్లు న్యూటెలా చాక్లెట్ స్ప్రెడ్

½ టీస్పూన్ ఎల్లో సాల్ట్ కలిగిన వెన్న

తయారీ విధానం:

న్యూటెలా చాక్లెట్ స్ప్రెడ్, వెన్నని తీసుకొని పెనం మీద వేడి చేయండి. మీకు అందుబాటులో ఉంటే మైక్రోవేవ్ ఒవెన్‌లో కూడా ఈ రెండింటిని కలిపి ఒక 5 సెకన్లపాటు వేడి చేయవచ్చు. అప్పుడు ఈ మిశ్రమం మరింత మెత్తగా అవుతుంది.

ఇప్పుడు దోశ వేసేందుకు పెనం తీసుకొని వేడి చేసి, కొద్దిగా నూనె వేయండి. ఆ తర్వాత నానబెట్టిన పిండిని ఒక గరిటెతో తీసుకొని వృత్తాకారంలో దోశను వేయండి.

దోశను ఒక నిమిషం పాటు పెనంపై కాల్చిన తర్వాత, న్యూటెలా మిశ్రమాన్ని దోశపై వేసి అన్నివైపులా సమానంగా విస్తరిస్తూపోండి. మరోవైపు కాల్చకూడదు, గమనించండి.

అంతే హాట్ హాట్ స్వీట్ స్వీట్ చాక్లెట్ దోశ ఇప్పుడు రెడీ. దీనిని ఫిల్టర్ కాఫీ సిప్ చేస్తూ తీసుకుంటే. ఆహా స్వర్గంలో తేలిపోతారు. ఇంకేం మీరూ చాక్లెట్ దోశ తింటూ ఎంజాయ్ చేయండి.

ఇకముందు.. బిస్కెట్ ఇడ్లీ, గులాబ్ జామ్ బోండా, కూల్ డ్రింక్ పూరి లాంటి వెరైటీ రుచులు ఏమైనా వస్తే ఆ రెసిపీలను మీకు తప్పకుండా పరిచయం చేస్తాం.