తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రతిరోజూ ఒక కప్ పసుపు ఛాయ్.. అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి!

ప్రతిరోజూ ఒక కప్ పసుపు ఛాయ్.. అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి!

Manda Vikas HT Telugu

28 December 2021, 16:20 IST

    • పసుపును కూరల్లో కాకుండా నేరుగా నీటితో తీసుకోవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పసుపు ఛాయ్ (Turmeric Tea) ఒక సులభమైన మార్గం అని సూచిస్తున్నారు. వాస్తవానికి పసుపు ఛాయ్ అంటూ ప్రత్యేకమైన పానీయం అంటూ ఏదీ లేదు. కాకపోతే మనం సాధారణంగా చేసుకునే 'డికాషన్ టీ' లో టీపొడికి బదులు పసుపు వినియోగించి మరిగించటమే టర్మరిక్ టీ.
Turmeric has the benefits of curcumin, which has the ability to heal.
Turmeric has the benefits of curcumin, which has the ability to heal. ( Shutterstock)

Turmeric has the benefits of curcumin, which has the ability to heal.

భారతీయ సంస్కృతిలో పసుపు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. శతాబ్దాలుగా అనేక విధాలుగా మనం పసుపును ఉపయోగిస్తున్నాం. మన వంటల్లో అయితే సర్వసాధారణం, దాదాపు అన్ని వంటకాల్లో దీన్ని వినియోగిస్తాం. పసుపు ఔషధ గుణాలకు ప్రసిద్ధి. దీనిని ఆహారంలో తీసుకోవడం ద్వారా మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన హానికరమైన మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే పసుపును కూరల్లో కాకుండా నేరుగా నీటితో తీసుకోవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పసుపు ఛాయ్ (Turmeric Tea) ఒక సులభమైన మార్గం అని సూచిస్తున్నారు.

ఇప్పటివరకు పాలల్లో కాస్త పసుపు వేసుకొని తాగడం మనకు తెలుసు, మరి ఈ టర్మరిక్ ఛాయ్ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారో చేసుకోవాలి? అనే దాని గురించి ఇక్కడ వివరిస్తున్నాం. వాస్తవానికి పసుపు ఛాయ్ అంటూ ప్రత్యేకమైన పానీయం అంటూ ఏదీ లేదు. కాకపోతే మనం సాధారణంగా చేసుకునే 'డికాషన్ టీ' లో టీపొడికి బదులు పసుపు వినియోగించి మరిగించటమే టర్మరిక్ టీ.

పసుపు ఛాయ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

1-అంగుళం సైజు గల చిన్నని పచ్చి పసుపు ముక్క

1 చిన్న దాల్చిన చెక్క

చిటికెడు ఫెన్నెల్ గింజలు

1 కప్పు నీరు

రుచి కోసం తేనె లేదా నిమ్మరసం

తయారుచేసుకునే విధానం:

1. పసుపు ముక్కను సన్నగా తరుగుకోవాలి లేదా చిన్న కల్వంలో ముద్దగా నూరుకోవాలి.

2. పాన్‌లో కప్ నీటిని పోసి కొద్దిసేపు మరిగించండి. నీరు మసులుతుండగా అందులో తురిమిన పసుపు, దాల్చినచెక్క, సోంపు గింజలను వేసుకోవాలి.

3. ఈ మిశ్రమం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్‌పై మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కనపెట్టండి.

4. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక కప్ లోకి వడపోసి, రుచికి తగినట్లుగా తేనే లేదా నిమ్మరసం పిండుకొని తాగొచ్చు.

పసుపు పచ్చి ముక్క అందుబాటులో లేకపోతే వేడినీటిలో రెండు చిటికెల పసుపు పొడి కలుపుకోవచ్చు.

ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక కప్ ఈ టర్మరిక్ టీ తాగడం వల్ల మీ శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మీ చర్మాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంతేకాకుండా వీటిలో దాల్చినచెక్క, ఫెన్నెల్ సీడ్స్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత తీసుకుంటే అలసట పోయి తాజాగా అనిపిస్తుంది.

మరిన్ని ప్రయోజనాలు:

ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం

ఇప్పుడు కీళ్ల నొప్పులు సర్వసాధారణమైయాయి. టర్మరిక్ టీ లేదా పసుపు పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి

పసుపులో ఉండే కర్కుమిన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు లాంటి ఆనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.

బరువు తగ్గడానికి 

బరువు తగ్గాలనుకుంటే, జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉదయాన్నే టర్మరిక్ టీ తీసుకోవడం ద్వారా మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

కాంతివంతమైన చర్మం కోసం

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సెల్ డ్యామేజ్‌తో పోరాడుతాయి. చర్మానికి చాలా మేలు చేస్తాయి. టర్మరిక్ టీ త్రాగడం ద్వారా వృద్ధాప్య ఛాయలు తగ్గి మీ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.