Wheat Dosa Recipe । వీకెండ్ కోసం రుచికరమైన అల్పాహారం.. గోధుమ పిండితో దోశ రెసిపీ!
వారాంతం వచ్చేసింది, ఈ పూట అల్పాహారం ఏం సిద్ధం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? గోధుమ పిండితో దోశ చేసుకోండి. తేలికగా ఉంటుంది, రుచికరంగానూ ఉంటుంది. Wheat Dosa Recipe కూడా చాలా సింపుల్.
వారాంతంలో విందులు, వినోదాలు అందరికీ సాధారణంగా ఉండేవే. కాబట్టి ఉదయం పూట తేలికైన అల్పాహారం తీసుకోవాలి. అది శక్తివంతమైనదై ఉండాలి. అయితే మీరు గోధుమ పిండితో చేసే చపాతీలు ఇది వరకు తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా గోధుమ దోశ తిన్నారా?
మనలో చాలా మందికి దోశ అనే అత్యంత ఇష్టమైన అల్పాహారం. అయితే ఇందులో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. ఇందులో గోధుమ పిండితో చేసుకునే దోశ ఎంతో ఆరోగ్యకరమైనది, రుచికరంగానూ ఉంటుంది.
ఈ గోధుమ దోశ కూడా మనకు తెలిసినా రవ్వ దోశ ఆకృతిని, అదే క్రిస్పీనెస్‌ను కలిగి ఉంటుంది. అయితే గోధుమ దోశ మరింత స్థిరంగా వస్తుంది. గోధుమ దోశ చేయటానికి పెద్ద ప్రక్రియ అనేది ఏం ఉండదు. ఇది కూడా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే రెసిపీనే. అయితే గోధుమ దోశ చేసేటపుడు ఉల్లిపాయలు వేసుకోకూడదు, అవసరం అనుకునే వారు ముందుగానే పిండిలో కలుపుకోవాలి. అలాగే ఎక్కువ మంట మీద కాల్చకూడదు, అప్పుడే దీని రుచి బాగుంటుంది.
మరి ఆలస్యం చేయకుండా గోధుమ దోశ రెసిపీ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
Wheat Dosa Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు గోధుమ పిండి
- 1/2కప్పు బియ్యం పిండి
- 2 టేబుల్ స్పూన్ల రవ్వ
- 1 టేబుల్ స్పూన్ పెరుగు
- 1-2 కప్పుల నీరు
- ఉల్లిపాయ
- 1 అంగుళాల అల్లం
- 1 పచ్చిమిర్చి
- తాజా కొత్తిమీర
- తాజా కరివేపాకు రెమ్మ
- 1 టీస్పూన్ జీలకర్ర
- 1/2 స్పూన్ ఉప్పు
- 2-3 టీస్పూన్ నూనె
గోధుమ దోశ తయారీ విధానం
- ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, బియ్యం పిండి, రవ్వ అలాగే పెరుగు వేసి కలపండి.
- ఆపై ఒక కప్పు నీరు వేసి కూడా కలపండి, ఉండలు లేకుండా చూసుకోండి.
- ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపండి. అవసరం అనుకుంటే మరికొన్ని నీళ్లు కలుపుకోండి.
- పిండి నీటిని పీల్చుకునే వరకు ఒక 20 నిమిషాల పాటు పక్కనపెట్టండి.
- ఇప్పుడు తవా వేడి చేసి, నూనెతో గ్రీజు చేసి ఇదివరకు సిద్ధం చేసుకున్న పిండితో దోశలు వేసుకోండి.
- పైనుంచి కూడా ఒక టీస్పూన్ నూనె వేసి మీడియం మంట మీద కాల్చుకోండి.
అంతే వేడివేడి గోధుమ దోశ రెడీ అయినట్లే. కొబ్బరి చట్నీని అద్దుకొని తింటూ దీని రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం