Wheat Bread Omelette । ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచే బ్రేక్‌ఫాస్ట్!
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం. కాబట్టి కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. అది మంచి పోషక విలువలతో కూడినది అయి ఉండాలి. అందుకే మీకోసం ఇక్కడ వీట్ ఆమ్లెట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని అందజేస్తున్నాం.

బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా మీరు రోజును ఎప్పుడైనా ప్రారంభించారా? ఒకవేళ చేస్తే ఇక ముందు అలా చేయకండి. ఎందుకంటే అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. ఏ కారణం లేకుండానే దీనిని ఇలా పరిగణించడం లేదు. ఉదయాన్నే మెదడు పనితీరు బాగుండాలంటే, మీరు చురుగ్గా పనిచేయాలంటే అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం. రాత్రి నుంచి 10-12 గంటల పాటు ఖాళీకడుపుతో ఉన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి అల్పాహారం ముఖ్యం. కాబట్టి మంచి పోషక విలువలతో కూడిన అల్పాహారం తీసుకోండి.
అయితే మీకు సులభంగా తేలికగా చేసుకొనే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఇక్కడ పరిచయం చేస్తున్నాం. దీనిని వీట్ బ్రెడ్ ఆమ్లెట్ అంటారు. గోధుమ బ్రెడ్, గుడ్డు, కూరగాయలతో కూడిన ఈ పవర్ ప్యాక్డ్ మీల్ మీకు ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
- హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ - 2 ముక్కలు
- గుడ్లు - 2
- నూనె - 1.5 స్పూన్
- పచ్చిమిర్చి - 1
- ఉల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్
- క్యాప్సికమ్, సన్నగా తరిగినవి - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- మిరియాలు - రుచికి తగినట్లుగా
- వేయించిన కూరగాయలు - 1 కప్పు బ్రోకలీ, క్యారెట్లు, బీన్స్, టమోటాలు, పాలకూర.
తయారీ విధానం
- నురుగు వచ్చేవరకు ఒక గిన్నెలో గుడ్డును బాగా గిలకొట్టండి. ఇందులో తరిగిన పచ్చిమిర్చి, మిరియాలపొడి, ఉప్పు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపండి.
- ఒక పాన్‌లో నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని పాన్‌పై వేసి, విస్తరించండి. మీడియం మంట మీద 2 నిమిషాలు వేడిచేయండి. అంచులు బ్రౌన్ అవ్వడం ప్రారంభించిన తర్వాత ఆమ్లెట్‌ను తిప్పండి.
- టోస్ట్ చేయడానికి అదే పాన్‌పై బ్రెడ్ ముక్కలను ఉంచండి. అనంతరం ఒక బ్రెడ్ ను ఆమ్లెట్ వేసి చతురస్రాకారంలో మడవండి.
- మరొక బ్రెడ్ స్లైస్‌ను పైన ఉంచి, ఆపై దానిని తిప్పండి. బ్రెడ్ బాగా టోస్ట్ అయిన వేడి నుంచి తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి.
- శాండ్‌విచ్‌ను సగానికి ముక్కలు చేసి, వేగిన కూరగాయలతో వేడిగా సర్వ్ చేయండి.
కూరగాయలు, గోధుమలు, గుడ్డు వంటి పోషకాలతో నిండిన ఈ బ్రేక్ ఫాస్ట్ మీకు ఉదయాన్నే మంచి శక్తిని అందిస్తుంది. ఇక దీనిని చాయ్ లేదా కాఫీని సిప్ చేస్తూ తీసుకోవచ్చు.
సంబంధిత కథనం