Tandoori Gobhi Recipe | తందూరీ గోభి రుచి చూస్తే.. ఆనందంతో చెందులేస్తారు!
సాయంత్రం స్నాక్స్ కోసం అయినా, స్నేహితులతో విందులో అయినా మంచింగ్ కోసం మనోహరంగా ఉండే తందూరీ గోభి రెసిపీ ఇక్కడ ఉంది, ట్రై చేసి చూడండి.
నాన్-వెజిటేరియన్లకు స్నాక్స్ తినాలనుకుంటే అసలు కొరతే ఉండదు. కానీ వెజిటేరియన్లకు మాత్రం ఎక్కువ ఆప్షన్లు ఉండవు. ఏది తిన్నా బోరింగ్‌గానే ఉంటుంది. స్టార్టర్స్ లలో పనీర్ టిక్కా అనేది రొటీన్, ఆలూ స్నాక్స్, పకోడి, మిర్చి బజ్జీలు ఎప్పుడూ ఉండేవే. ఇంకా ఏదైనా కొత్తగా, రుచికరంగా కావాలని మీ నాలుక కోరుకుంటోందా? అయితే తందూరి గోభి శాఖాహారులందరికీ పర్ఫెక్ట్ పార్టీ డిలైట్ అవుతుంది. మీ స్నేహితులందరితో కలిసి వేడుక చేసుకునేటపుడు, కుటుంబ సభ్యులంతా కలిసి కబుర్లు అడుకునేటపుడు లేదా సాయంత్రం వేళ సరదాగా స్నాక్స్ లా తినాలనుకున్నా ఈ తందూరీ గోభి మీకు మంచి రుచిని అందిస్తుంది.
సాధారణంగా ఇతర స్నాక్స్ రెసిపీలన్నింటికీ ఎక్కువ నూనెలో స్నానం చేయించాల్సి ఉంటుంది. అయితే తందూరీ స్టైల్లో వండే వంటకాలకు మాత్రం పెద్దగా నూనె అవసరం ఉండదు. రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యమూ బాగుంటుంది.
మరి రుచికరమైన తందూరీ గోభిని తినాలని ఉందా? దీనిని ఎలా చేసుకోవాలి? కావలసిన పదార్థాలేమిటి? తెలుసుకోండి. సింపుల్ రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం.
Tandoori Gobhi Recipe కోసం కావలసినవి
- 500 గ్రాములు కాలీఫ్లవర్
- 1/2 కప్పు పెరుగు
- 1 స్పూన్ అల్లం పేస్ట్
- 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్
- 2 టేబుల్ స్పూన్ల కాల్చిన శనగపిండి
- 1 స్పూన్ నూనె
- 1/2 స్పూన్ కారం
- 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి
- 1 స్పూన్ ఉప్పు
- 2 టేబుల్ స్పూన్లు తందూరీ మసాలా
తందూరీ గోభి తయారు చేయడం
- ముందుగా తందూరీ మసాలాను సిద్ధం చేసుకోండి. ఇందుకోసం లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర, జాజికాయ, శొంఠి, ధనియాలు, మెంతులు, వాములను రుబ్బుకుని తందూరీ మసాలా సిద్ధం చేసుకోవాలి.
- ఆ తర్వాత ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, నూనె, కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్ , ఉప్పు వేసి బాగా కలపండి.
- పై మిశ్రమంలో తందూరి మసాలా కూడా వేసి బాగా కలుపుకోండి.
- ఇప్పుడు గోభిని పెద్దసైజు ముక్కలుగా చేసుకొని గిన్నెలో వేసి, ముక్కలకు తందూరీ మిశ్రమాన్ని బాగా పట్టించండి. అనంతరం దీనిని 15 నిమిషాల పాటు పక్కనబెట్టి మెరినేట్ చేయండి.
- చివరగా మసాలాతో మేరినేట్ చేసుకున్న గోభి ముక్కలను 220 డిగ్రీల సెల్సియస్ వద్ద 20-25 నిమిషాల పాటు గ్రిల్ చేయండి. లేదా నిప్పులపై కాల్చవచ్చు.
అంతే తందూరీ గోభి సిద్ధమైనట్లే.. దీనిని వేడిగా ఉన్నప్పుడే గ్రీన్ చట్నీతో అద్దుకొని లాగించండి. కడుపు తృప్తిగా ఉంటుంది.
సంబంధిత కథనం