రొంభ నల్ల ఇడ్లీ! మీరు ఎప్పుడైనా ‘డీటాక్స్ ఇడ్లీ’ రుచి చూశారా?
28 February 2022, 17:16 IST
- డీటాక్స్ ఇడ్లీ పేరుతో నాగ్‌పూర్‌లోని ఓ టిఫిన్ సెంటర్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది అక్కడ తయారు చేస్తున్న ఇడ్లీలు సోషల్ మీడియా ద్వారా వైరలైంది. ఈ ఇడ్లీలను ప్లేటుకు రూ. 50 నుంచి రూ. 150 వరకు ఛార్జ్ చేస్తున్నారు.
Detox Idli
ఇడ్లీ అనేది ఒక తేలికైన అల్పాహారం. మృదువుగా, సుతిమెత్తగా ఉండే ఈ రైస్ కేక్‌లను తింటే సులువుగా జీర్ణమవడమే కాకుండా, ఎంతో ఆరోగ్యకరమని నమ్ముతారు. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోనైనా, సాయంకాలం అల్పాహారంగానైనా ఇడ్లీలు తీసుకోవటానికి చాలామంది ఇష్టపడతారు. సౌత్ ఇండియన్ అల్పాహారాల్లో ఎంతో పాపులర్ వంటకం అయిన ఇడ్లీని చట్నీ అద్దుకొని, సాంబారులో ముంచుకొని తింటే ఆ రుచి ఆహా.. స్వర్గం అంచులను తాకినట్లు అనిపిస్తుంది.
సరే, ఇప్పుడు ఈ ఇడ్లీల గురించి ఎందుకీ వర్ణన, ఇడ్లీ గురించి తెలియనివారుంటారా అంటే? మీకు ఇప్పటివరకు తెల్ల రవ్వ ఇడ్లీలు, క్యారెట్ ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ లాంటి వైరైటీలు రుచిచూసి ఉంటారు. ఈ మధ్య ఆరోగ్యంపై శ్రద్ద కాస్త ఎక్కువ ఉన్నవాళ్లు మిల్లెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీలని కొత్తకొత్త రుచుల ఇడ్లీలను ఆస్వాదించి ఉండవచ్చు. కానీ మీరేప్పుడైనా నల్లటి నలుపున్న ఇడ్లీలను తిన్నారా? ఇప్పుడవీ వచ్చేశాయ్.
ఎక్కడంటే..
డీటాక్స్ ఇడ్లీ పేరుతో నాగ్‌పూర్‌లోని ఓ టిఫిన్ సెంటర్ వడ్డిస్తున్న ఈ నల్లటి నలుపు ఇడ్లీ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఈ ఇడ్లీలను ప్లేటుకు రూ. 50 నుంచి రూ. 150 వరకు ఛార్జ్ చేస్తున్నారు. చూడటానికి చాక్లెట్ కేకుల్లా కనిపించే వేడి వేడి నల్లటి ఇడ్లీలలో కూసింత నెయ్యి, కారంపొడి వేసుకుని తింటే ఆ రుచే వేరు అని తిన్నవారు చెబుతున్నారు.
కావాలంటే, ఈ వీడియో చూడండి
ఇడ్లీలు ఎందుకు తెల్లగా ఉండాలి? కలర్ కలర్ రంగుల్లో ఎందుకు ఉండకూడదు? అని ఒక వ్యక్తి సరదాగా ప్రశ్నించగా దానిని సీరియస్‌గా తీసుకొన్న ఈ టిఫిన్ సెంటర్ యజమాని ఇలా నల్లటి ఇడ్లీల రెసిపీని ఆలోచించి ప్రయోగం చేశాడట. దీంతో అది కాస్త సూపర్ సక్సెస్ అయింది. అయితే వీటికి డీటాక్స్ ఇడ్లీ అని పేరు మాత్రం తను పెట్టలేదట. ఈ ఇడ్లీ తయారీలో ఒక ఇంగ్రీడియంట్‌గా చార్‌కోల్ ఉపయోగించడం తెలిసి ప్రజలే వీటిని డీటాక్స్ ఇడ్లీ అంటూ పాపులర్ చేశారని ఈ రెసిపీ సృష్టికర్త చెప్పడం గమనార్హం.