తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rahul Gandhi Key Comments On Special Category Status To Andhrapradesh

Rahul Jodo Yatra in AP : అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా - రాహుల్ గాంధీ

HT Telugu Desk HT Telugu

19 October 2022, 14:34 IST

    • తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఏపీలో జోడో యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన… కర్నూలులో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (twitter)

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

Rahul Gandhi Bharat Jodo Yatra in AP: కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదోని మండలం చాగి గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర... ఉదయం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు సాగింది. ఈ సందర్భంగా కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన… పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జోడో యాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. దీనితో ఏపీలో కాంగ్రెస్ ను పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

ఏపీలోని ప్రధాన పార్టీలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ… వారు రాజకీయాలన్ని వ్యాపారంలా చేస్తున్నారని కామెంట్స్ చేశారు. ఇదే అంశంపై ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ… మీరు గతంలో ఓ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుందని అని అడిగారు. వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని అడిగిన ప్రశ్నపై స్పందించిన రాహుల్ గాంధీ…. పొత్తుల అంశాన్ని పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని బదులిచ్చారు.

అమరావతిపై స్పందిస్తూ… ఏపీకిఒకే రాజధాని ఉండాలన్న ఆయన.. 3 రాజధానుల నిర్ణయం సరైనది కాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్నంత ప్రజాస్వామ్యం మరే పార్టీలోనూ లేదని స్పష్టం చేశారు. ప్రతి పార్టీలోనూ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరిగినప్పటికీ… కేవలం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల గురించే ఇంతలా అడుగుతున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏంటో అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ చెప్పారు.

special category status to andhra pradesh: తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదన్న ఆయన… కాంగ్రెస్‌లో తప్ప ఏ పార్టీలోనూ నేతలు అసంతృప్తి బహిరంగంగా తెలియజేయరని చెప్పారు. అన్ని పార్టీలలో నియంతృత్వం ఉంటుంది కాబట్టి ఇతర నేతలు ఎవరూ మాట్లాడలేరన్నారని చెప్పారు.

భారత్ జోడో యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు రాహుల్ గాంధీ. దేశంలో కొన్ని శక్తులు ద్వేషం, హింసను పెంచుతున్నాయని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని చెప్పారు.