తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Mlc Election Counting And Tdp Mlc Candidates In Lead For Uttarandhra And Rayalaseema Areas

Graduate MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్..జోరు మీదున్న సైకిల్

HT Telugu Desk HT Telugu

17 March 2023, 9:33 IST

    • Graduate MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థులు ముందంజలోకి వచ్చారు.ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ఎదురుగాలి వీస్తోంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన పట్టభద్రులు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన పట్టభద్రులు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన పట్టభద్రులు

Graduate MLC Results: ఆంధ్రప్రదేశ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థిపై ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి విజయానికి అత్యంత చేరువలో ఉన్నారు. చిరంజీవి గెలుపు దాదాపుగా ఖరారైంది.

మరోవైపు టీడీపీ పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనల అమలు,అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు,ఎన్నికల అధికారులకు చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా,అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ,ఎస్పీ ఫకీరప్పలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు.

కౌంటింగ్‌లో అక్రమాలకు తావుండకూడదన్న చంద్రబాబు

అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి...టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ శ్రేణులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్దమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను చంద్రబాబు కోరారు.ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు,ఎన్నికల బాధ్యులకు చంద్రబాబు ఆదేశించారు.

టీడీపీ నేతల్లో జోష్....

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే నిదర్శనమని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించడంపై మాజీ మంత్రి,విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా యువత,ఉపాధ్యాయులు,ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ఓటు ద్వారా స్పష్టమైందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారానైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా టిడిపికి వచ్చిందంటే టిడిపి పట్ల సానుకూలత కూడా కనిపిస్తుందని భావించొచ్చన్నారు. తెలుగుదేశం పార్టీతోపాటు చిరంజీవికి వ్యక్తిగతంగా,స్వచ్ఛంధంగా ఓట్లు వేశారని చెప్పారు.

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓటర్లు ఛీ కొట్టారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి దూసుకుపోతోందని, ఏ రౌండ్ లోనూ, కనీసం పోటీ ఇవ్వలేకపోయిందన్నారు. జగన్‌ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదని, రాజధానికబుర్లు నమ్మలేదన్నారు. రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం,గడచిన 4 ఏళ్ళ చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారన్నారు.రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరని గుర్తించారని అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. వైసీపీ అంతానికి ఆరంభం ఇదేనని తెలిపారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రామచంద్రారెడ్డి గెలుపు...

మరోవైపు కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసీపీ బలపరిచిన అభ్యర్ధి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి గెలుపొందారు. అనంతపురం నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గురువారం ఉదయం 08:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు.

శుక్రవారం తెల్లవారుజామున 04:00 గంటల వరకు కౌంటింగ్ నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో వైసీపీ మదద్తు ఇచ్చినఎం.వి.రామచంద్రారెడ్డి గెలిచినట్లుగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రకటించారు. కౌంటింగ్ లో ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు రాగా, ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు వచ్చాయని తెలిపారు.