తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Delhi Tour: కేంద్రం నుంచి పిలుపు.. ఢిల్లీకి చంద్రబాబు - షెడ్యూల్ ఇదే

Chandrababu Delhi Tour: కేంద్రం నుంచి పిలుపు.. ఢిల్లీకి చంద్రబాబు - షెడ్యూల్ ఇదే

HT Telugu Desk HT Telugu

23 November 2022, 13:02 IST

    • Chandrababu Delhi Tour News: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu Delhi Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి.. చంద్రబాబు హాజరుకానున్నారు. 2022 డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు జరగనున్న జీ 20 దేశాల కూటమి సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించనుంది. రాజకీయ పార్టీల అధ్యక్షులతో.. జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశంలో ప్రధాని మోదీ చర్చించనున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని చంద్రబాబుకు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి ఆహ్వానం అందింది. చంద్రబాబుకు ఫోన్‌ చేసి భేటీపై సమాచారం అందించారు. సమావేశ ప్రాధాన్యతను కేంద్రమంత్రి చంద్రబాబుకు వివరించారు.

chandrababu meet pm modi: ఇదే ఏడాది ఆగస్టులో ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో కేంద్రం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం... మోదీతో చంద్రబాబు ఐదు నిమిషాలకు పైగా మాట్లాడారు. మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు బయటికి వచ్చిన తర్వాత... వీరిద్దరూ కలిసిన సందర్భాలు లేవు.

కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు... మోదీని కలవటంతో... ఏయే అంశాలపై చర్చించుకున్నారన్నది అప్పట్లో పెద్ద ఆసక్తినే రేపింది. మరోవైపు ఏపీలో ఇప్పటికే బీజేపీ - జనసేన కలిసి పని చేస్తున్నాయి. 2014లో మాదిరిగా మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తాయని గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా జనసేన ప్రస్తావిస్తున్నప్పటికీ... బీజేపీ నేతల నుంచి మాత్రం క్లారిటీ లేదు. తాజాగా మరోసారి చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.