Modi Chandrababu Meet : ఎన్నాళ్లకెన్నాళ్లకో.. మోదీని కలిసిన చంద్రబాబు
ప్రధాని మోదీకి ఎన్నోసార్లు లేఖలు రాశారు చంద్రబాబు. చాలాసార్లు కలవాలనుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత తాజాగా కలిశారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది.
2014 ఎన్నికల్లో మోదీకి మద్దతిచ్చి.. చాలా దగ్గరగా ఉన్నారు చంద్రబాబు. ఆ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా 2019 ఎన్నికల్లో మోదీపై విమర్శలు గుప్పించి దూరమయ్యారు. అనంతరం రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ.. చాలాసార్లు ప్రధానికి లేఖలు రాశారు. కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఇప్పుడు వారిద్దరూ కలవడంతో ఏపీ రాజకీయాల్లో చర్చ మెుదలైంది. ఇద్దరు పక్కకు వెళ్లి ఓ ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారట. ఈ సీన్ ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. మళ్లీ బీజేపీతో టీడీపీ పొత్తు ప్లాన్ ఏదైనా చర్చించారా అనే అభిప్రాయాలు వస్తున్నాయి.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతోంది. ఆగస్టు 13,14,15 తేదీల్లో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ మీటింగ్ ను దిల్లీలో ఏర్పాటు చేసి.. అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటుగా కీలక నేతలను ఆహ్వానించారు. చంద్రబాబుకు కూడా ఆహ్వానం రావడంతో వెళ్లారు. 2018 తర్వాత మోదీ చంద్రబాబు కలిసిన వేదిక ఇదే. కార్యక్రమం అయిపోయాక ప్రధాని మోదీ.. చంద్రబాబు వద్దకు వచ్చారు. పక్కకు వెళ్లి ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.
ఇలా చాలామందితోనే మోదీ మాట్లాడారు. కానీ చంద్రబాబుతో పక్కకు వెళ్లి ఐదు నిమిషాలు మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఏం చర్చించి ఉంటారా అని ఎవరికి వారు.. ఊహించేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత.. కొన్ని రోజులకు బీజేపీతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నాలు చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ప్రధానితో మీటింగ్ కుదరలేదు. కావాలనే.. పక్కకు పెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ.. తాజాగా చంద్రబాబుకు పీఎంవో నుంచి ఆహ్వానం రావడం, మోదీ కలిసి మాట్లాడటంతో మళ్లీ పొత్తు ప్లాన్ వేస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. అక్కడ ఏం మాట్లాడుకుంది మాత్రం ఎవరికీ తెలియదు. అన్నీ ఊహగానాలే.