Telugu News  /  Andhra Pradesh  /  Tdp President Chandra Babu Naidu Slams Ap Cm Jagan Mohan Reddy
టీడీపీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలోచంద్రబాబు నాయుడు
టీడీపీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలోచంద్రబాబు నాయుడు

Tdp ChandraBabu :ఏపీలో అంతులేని అరాచకం… చంద్రబాబు నాయుడు

20 November 2022, 6:38 ISTHT Telugu Desk
20 November 2022, 6:38 IST

Tdp ChandraBabu రాష్ట్రంలో అరాచకానికి అంతు లేకుండా పోతోందని, ముఖ్యమంత్రితో పాటు, ప్రతి ఎమ్మెల్యే రాష్ట్రాన్ని ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం, మైనింగ్ కుంభకోణాలతో పాటు బెదిరించి ప్రజల ఆస్తులు గుంజుకుంటున్నారని, అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి చిన్నచిన్న క్వారీలు మొదలుకుని పోర్టుల వరకు వదిలేసుకున్న వాళ్లు రాష్ట్రంలో ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించేలా పాలన సాగుతోందని మండిపడ్డారు.

Tdp ChandraBabuతెలుగు రాష్ట్ర ప్రభుత్వ రివర్స్ పాలనపై “ఇదేం ఖర్మ!” అనే కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నామో....ప్రతి పక్షంలోనూ అంతే బాధ్యతగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఒక్కొక్కరిపై 20 నుంచి 50 కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తనపై కూడా కేసులు పెడుతున్నారని, ప్రజలు ఏమనుకుంటారోననే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు చంద్రబాబు మార్గ నిర్దేశం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

సంక్షేమం, అభివృద్దికి టీడీపీ ఒక నమూనా నిలిచిందని, చాలా మంది మఖ్యమంత్రులను చూశానని, చాలా మందితో పోరాడానని చంద్రబాబు చెప్పారు. 1984లోనే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి గెలిచామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మొదలుకుని, ఎమ్మెల్యేల వరకు వాటాల కోసం ఒత్తిడి చేస్తున్నారని, రాష్ట్రానికి రావాలంటేనే పరిశ్రమలు భయపడుతున్నాయని, ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలకు ఇఫ్పటి నుంచి సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు.

ఓటుకు పదివేలిస్తారు…?

వచ్చే ఎన్నికల్లో ఓటుకు పదివేలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టినా, బెదిరించినా, పోలీసులను ప్రయోగించినా వాటిని తిప్పి కొట్టేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, ఎన్నికలకు టీడీపీ సిద్ధం లేనందున ఇప్పుడు ఎన్నికలు పెట్టేస్తామని వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సత్తా చాటేందుకు తాము సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు అవమానకరంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణాజిల్లా గూడూరులో సిఎం కటౌట్ తగలబడితేనే పోలీసు జాగిలాలు తీసుకు వెళ్లి హడావుడి చేశారని, తునిలో టీడీపీ నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే మాత్రం పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. సామాన్యుల ప్రాణాలంటే ఎందుకు లోకువని చంద్రబాబు ప్రశ‌్నించారు.

ఇంత దారుణమైన, నీచమైన ప్రభుత్వం నేను ఎక్కడా చూడలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం అచ్చెన్నాయుడుతో మొదలు సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరినీ వేధించారని, కోర్టులకు వెళ్లి అనేక కేసులపై పోరాడామని, అక్రమంగా అరెస్టులు చేసి, పోలీసు టార్చర్ చేసి కార్యకర్తలను, నేతలను వేధించారని ఆరోపించారు.

పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఎప్పుడు చూడలేదని, ఎంపి రఘురామ కృష్ణ రాజును ప్రభుత్వం వేధించే విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, అంత ఘటన జరిగిన తరువాత కూడా ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. పార్టీ కార్యాలయంలోపని చేసే మీడియా కో ఆర్డినేటర్ ను కూడా అరెస్టు చేశారని, తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై చర్యలు తీసుకునేది ఖాయమని చెప్పారు.

సిఎంకు చెందిన ఒక ఫ్లెక్సీ చినిగితే హంగామా చేసిన పోలీసులు...తునిలో భక్తుడి వేషంలో టీడీపీ నేతపై హత్యాయత్నం చేస్తే పోలీసులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. బాధ, ఆవేదన, కసి నాకూ ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యం పద్దతిలో ఆలోచిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలతో గెలిచారని, బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, దీంతో మంచి స్పందన వస్తోందని చెప్పారు.

ఇగోలు పక్కన పెట్టండి…..

టీడీపీలో నాయకులు అంతా ఇగోలు పక్కన పెట్టి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజల్లో మార్పు వచ్చిందని...అందుకే నేతలు కూడా హుషారుగా ఉన్నారని చెప్పారు. ప్రజా చైతన్యంలో అనుమానం లేదని, దాన్ని మరో స్టేజ్ కు తీసుకువెళ్లడంలో నాయకులు చొరవ చూపాలన్నారు. "ఇదేంఖర్మ" రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన చంద్రబాబు ఆదేశించారు. సిఎం కటౌట్ కు ఉన్న ప్రాధాన్యం ప్రజల ప్రాణాలుకు ఇవ్వడం లేదు ఇదేం ఖర్మ.? అని ప్రతి వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఇదేం ఖర్మ" కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నిర్వహించాలని సూచించారు.

టాపిక్