తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Nominated Posts : గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ

AP Nominated Posts : గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ

23 September 2024, 11:45 IST

google News
    • AP Nominated Posts : మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తలే బలం అని.. వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న చంద్రబాబు.. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని శ్రేణులకు సూచించారు.

'తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నేతల త్యాగాలను విస్మరించబోము. కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాం. స్వతహాగా ఎదిగేలా ఎంపవర్‌ మెంట్‌ చేస్తాం. పార్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌ విభాగం ద్వారా యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ద్వారా విద్యార్థులకు శిక్షణను ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాం' అని చంద్రబాబు వివరించారు.

'నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నాం. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల నియామకాల్లో సముచిత ప్రాధాన్యత ఇస్తాము. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుంది. చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి వ్యవస్థలను సర్వనాశనం చేశారు. నాటి వారి పాపాలే నేడు ప్రజలకు శాపాలుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజా క్షేత్రంలో వివరించాలి' అని చంద్రబాబు నాయకులకు సూచించారు.

'కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మనం చేసిన పనులు ప్రజలకు తెలపాలి. గత పాలకులు పాపాలను ప్రజలకు తెలియజేయాలి. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మంచి ప్రభుత్వమని అన్ని వర్గాలు సంతోషంగా చెబుతున్నాయి. 2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తా. ప్రజల సెంటిమెంట్ తోనూ ఆడుకునే స్థాయికి గత పాలకులు దిగజారారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారు. దోషులను వదలబోము. నేరం చేయడం, తప్పించుకోడానికి ఎదురుదాడి చేయడం అలవాటుగా మారింది. ఇలానే వదిలేస్తే అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మోసం చేస్తారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అధికారం చేపట్టగానే తిరుమల నుండే ప్రక్షాళన మొదలు పెట్టాం. తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప ఏ ఇతర నినాదాలు వినిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతను తీవ్ర నిరాశలో కూరుకుపోయేలా చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకు తొలిసంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై పెట్టాం. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం' అని బాబు భరోసా ఇచ్చారు.

'గత ప్రభుత్వంలో తమ ఆస్తులను ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారోనని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాము. ఏప్రిల్, మే, జూన్ నెలలవి కూడా పింఛన్ పెంచి జూలై నెలలో రూ.7 వేలు అందించాం. ప్రతి నెలా ఒకటవ తేదీనే రూ.4 వేలు అందిస్తున్నాం. 100 రోజుల్లో 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాము. మిగిలినవి త్వరలోనే ప్రారంభిస్తా. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ పెట్టబోతున్నాము' అని చంద్రబాబు ప్రకటించారు.

'ప్రజల ఇసుక కష్టాలు తీర్చడం కోసం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చాం. లోడింగ్, సీనరేజ్, రవాణా ఖర్చులు పెట్టుకుంటే చాలు...ఇసుక కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మద్యం విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కల్తీ మద్యాన్ని అరికట్టాం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం టార్గెట్ గా ముందుకెళ్తాం' అని చంద్రబాబు వివరించారు.

'విజయవాడ వరద బీభత్సానికి అతలాకుతలమైంది. బాధితులకు అండగా నిలబడ్డాం. వరదల్లో మునిగిన ఇంటికి రూ. 25 వేలు, హెక్టారు వరికి రూ.25 వేలు ఆర్థిక సాయం ప్రకటించాం. మోటార్ వెహికిల్స్ పాడయితే రూ.3 వేలు ఇవ్వడంతో పాటు, ఇంట్లోకి నీరొచ్చిన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు' అని సీఎం వ్యాఖ్యానించారు.

'ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేస్తాం. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం అనాధలా మిగిలిపోయింది. ఐదేళ్లపాటు ప్రాజెక్టు పనులు పూర్తిగా పడకేయడమే కాకుండా.. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లను కేంద్రం మంజూరు చేయడమే కాకుండా.. 2027 మార్చిలోగా ఫేజ్-1 ను పూర్తి చేసేందుకు షెడ్యూల్ ప్రకటించింది' అని చంద్రబాబు వివరించారు.

'వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అమరావతిని చంపేసింది. కుల, మత, ప్రాంతాల మధ్య విధ్వేషాలు రగిల్చింది. ఐదేళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రం చేశారు. కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. త్వరలోనే రాజధాని పనులు మొదలుపెడతాము. అమరావతికి ప్రసిద్ధ విద్యా సంస్థలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా సోలార్ వెలుగులు నింపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము. భవిష్యత్ లో ధర్మల్ విద్యుత్తు వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడకాన్ని పెంచాలి' అని సూచించారు.

'ఎనర్జీ రంగంలో గ్రీనర్ ఫ్యూచర్ వైపు అడుగులు పడుతున్నాయి. వ్యవసాయరంగంలోనూ టెక్నాలజీని వాడుతున్నారు. రాష్ట్రంలో మూడు ఇంటస్ట్రియల్ పార్కులను కేంద్రం మంజూరు చేసింది. విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరిస్తున్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చింది. జలవనరులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, మౌలిక వసతులకు రూ. 2 వేల 500 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి' అని చంద్రబాబు వెల్లడించారు.

'ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం. గత అసమర్థ పాలనతో ప్రభుత్వంలోని పలు విభాగాలు గాడితప్పాయి. వాటిని సరిదిద్దుతున్నాము. పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ముందుకు పోతున్నాము. మనది ప్రజా ప్రభుత్వం.. ఆర్భాటాలు లేవు. 100 రోజుల్లో ఏం చేశామో ప్రజలకు చెప్పండి. నేతలు ఇంటింటికీ వెళ్లాలి. గ్రామ, వార్డు సచివాలయాతో పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలి. మనం చేసిన మంచి పనులు అందరికీ తెలియాలి. చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు మనం సంక్షేమం, అభివృద్ధి అందించాలి' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం