YS Jagan Letter To PM Modi : తిరుమల లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గుతేల్చండి, ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ-tirumala laddu issue former cm ys jagan letter to pm modi to reveal fact on ghee adulteration ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Letter To Pm Modi : తిరుమల లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గుతేల్చండి, ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

YS Jagan Letter To PM Modi : తిరుమల లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గుతేల్చండి, ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

Bandaru Satyaprasad HT Telugu
Sep 22, 2024 04:00 PM IST

YS Jagan Letter To PM Modi : తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ...ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే విచారణ చేయించి వాస్తవాలను బయటపెట్టాలన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గుతేల్చండి, ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
తిరుమల లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గుతేల్చండి, ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

YS Jagan Letter To PM Modi : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని ప్రచారం చేయడం వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైఎస్ జగన్ అన్నారు. ఇంత సున్నితమైన అంశాన్ని ఏపీలోని కూటమి పార్టీలు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ జగన్ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని వైఎస్ జగన్ ఆరోపించారు.

కూటమి పార్టీల నాయకులు టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని జగన్ లేఖలో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వివాదంలో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏదైనా పొరపాటు జరిగితే విచారణ చేయించి వాస్తవాలను బయటపెట్టాలని జగన్ కోరారు.

ఎన్నికల హామీలను తప్పించుకునేందుకే ఈ ప్రయత్నం

"ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఏపీలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీల అమలు చేయడంలేదని కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని గమనించి సీఎం చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం ఆమోదించలేకపోయింది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు సామర్ధ్యాలపై నమ్మకం కోల్పోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ పద్ధతులకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. తిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న నెయ్యిలో కల్తీ ఉందని, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ఆరోపించారు" -వైఎస్ జగన్

కోట్లాది మంది హిందూ భక్తుల ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఇది నిజంగా రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న అబద్ధపు ప్రచారం అని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. 2024 జులై 12న కల్తీ నెయ్యి ఉన్న ట్యాంకర్ తిరుపతికి చేరుకుందని, దానిని టీటీడీ అధికారులు తిరస్కరించారన్నారు. ప్రసాదాల తయారీలో ఆ నెయ్యి ఉపయోగించలేదని తెలిపారు.

టీటీడీ బోర్డు పర్యవేక్షణలో

గత కొన్ని దశాబ్దాలుగా నెయ్యి కొనుగోళ్లలో టీటీడీ అనుసరిస్తున్న విధానాలు చాలా పటిష్టంగా ఉంటాయని జగన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని నిర్వహించే స్వతంత్ర ట్రస్ట్ అని తెలిపారు. ధర్మకర్తల మండలిలో విభిన్న నేపథ్యాల నుంచి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సిఫార్సు చేసిన బలమైన భక్తులు ఉంటారన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే ఆచారం ఉందన్నారు. ప్రస్తుత టీటీడీ బోర్డులో ఉన్న కొందరు బీజేపీకి కూడా అనుబంధంగా ఉన్నారన్నారు. టీటీడీ పరిపాలనను పర్యవేక్షించే అధికారం ధర్మకర్తల మండలికి ఉందని, ఆలయ వ్యవహారాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ పాత్ర ఉందన్నారు.

"ప్రతి ఆరు నెలలకోసారి నెయ్యి సేకరణకు టెండర్ ప్రక్రియ జరుగుతుంది. బిడ్డింగ్ లో నెయ్యికి కోట్ చేసిన ధర ఆధారంగా అర్హత ప్రమాణాలకు పాటించే సంస్థను ఎంపిక చేస్తారు. టెండరింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తక్కువ కోట్ చేసిన సరఫరాదారుని ఎంపిక చేస్తారు. ఆమోదం కోసం బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ముందు ఉంచుతారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలానే జరిగింది"-వైఎస్ జగన్

నెయ్యి వినియోగానికి నాణ్యతను పరీక్షిస్తారని వైఎస్ జగన్ తెలిపారు. ఆలయానికి చేరిన నెయ్యి ట్యాంకర్‌ లోని నెయ్యి శాంపిల్స్ తీసుకుని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల వద్ద నాణ్యతను టెస్ట్ చేస్తారన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని నెయ్యిని తిరిగి పంపేస్తారన్నారు. అందువల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్న తలెత్తదన్నారు.

సంబంధిత కథనం