Hindu marriage: ‘‘హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు.. విడాకులకు సరైన కారణం అవసరం’’: అలహాబాద్ హైకోర్టు-hindu marriage not a contract divorce needs valid consent rules allahabad hc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hindu Marriage: ‘‘హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు.. విడాకులకు సరైన కారణం అవసరం’’: అలహాబాద్ హైకోర్టు

Hindu marriage: ‘‘హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు.. విడాకులకు సరైన కారణం అవసరం’’: అలహాబాద్ హైకోర్టు

Sudarshan V HT Telugu
Sep 14, 2024 09:10 PM IST

Hindu marriage: హిందూ వివాహాలు పవిత్రమైనవని, ఒప్పందాల మాదిరిగా రద్దు చేయలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. హిందూ వివాహాన్ని కేవలం ఒక కాంట్రాక్ట్ గా భావించకూడదని స్పష్టం చేసింది. సరైన కారణం, సమ్మతి లేకుండా వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయకూడదని తేల్చి చెప్పింది.

‘‘హిందూ వివాహం అంటే కాంట్రాక్ట్ కాదు’’: అలహాబాద్ హైకోర్టు
‘‘హిందూ వివాహం అంటే కాంట్రాక్ట్ కాదు’’: అలహాబాద్ హైకోర్టు

Hindu marriage: హిందూ వివాహ వ్యవస్థపై అలహాబాద్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహాన్ని ఒక ఒప్పందంగా పరిగణించి, రద్దు చేయడం కుదరదని తీర్పునిచ్చింది. పవిత్ర బంధంగా భావించే హిందూ వివాహాన్ని ఇరు పక్షాలు ఇచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా పరిమిత పరిస్థితుల్లో మాత్రమే చట్టపరంగా రద్దు చేయవచ్చని కోర్టు పేర్కొంది.

వివాహ రద్దును వ్యతిరేకిస్తూ..

తమ వివాహ రద్దును వ్యతిరేకిస్తూ భార్య దాఖలు చేసిన అప్పీలుకు సంబంధించిన కేసులో, అలహాబాద్ హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సౌమిత్ర దయాళ్ సింగ్, జస్టిస్ దొనాడి రమేష్ ల డివిజన్ బెంచ్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ కోర్టైనా ఇరువురి సమ్మతితో, సరైన కారణం ఉంటేనే వివాహాన్ని రద్దు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ పరస్పర సమ్మతి చెల్లుబాటు అయ్యేలా ఉండాలని పేర్కొంది. తుది నిర్ణయానికి ముందు ఒక పక్షం తమ సమ్మతిని ఉపసంహరించుకుంటే, అంతకుముందు ఇచ్చిన సమ్మతి ఆధారంగా విడాకులు మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. మొదటి సమ్మతి ఆధారంగా విడాకులు మంజూరు చేస్తే, న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

విచారణ దశలో కూడా సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు

విడాకులకు, వివాహం రద్దుకు మొదట్లో సమ్మతి తెలిపిన పిటిషనర్.. ఆ తరువాత, విచారణ దశలో ఆ సమ్మతిని ఉపసంహరించుకున్నట్లయితే, విడాకుల పిటిషన్ పై ముందుకు వెళ్లలేమని కోర్టు తెలిపింది. ప్రస్తుత కేసులో, మూడు సంవత్సరాల క్రితం విడాకులకు అంగీకరించిన ఆ భార్య.. ఆ తరువాత ఆ సమ్మతిని ఉపసంహరించుకుంది. కింది కోర్టు ఆమె మొదట ఇచ్చిన సమ్మతిని పరిగణనలోకి తీసుకుని విడాకులు మంజూరు చేసింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హై కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

2011 నాటి కేసు

బులంద్ షహర్ అదనపు జిల్లా జడ్జి 2011లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హై కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. 2006లో వివాహం చేసుకున్న ఈ మహిళ 2007లో భర్తను వదిలేసి వెళ్లిపోయింది. 2008లో భర్త విడాకులకు దరఖాస్తు చేసుకోగా, భార్య మొదట విడిగా జీవించడానికి అంగీకరించింది. అయితే విచారణ సందర్భంగా ఆ మహిళ తన వైఖరిని మార్చుకుని విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేసింది. చివరికి, ఈ జంట రాజీపడి కలిసి జీవించడం ప్రారంభించారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కాని ఇంతకు ముందు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వారికి బులంద్ షహర్ అదనపు జిల్లా జడ్జి విడాకులు (divorce) మంజూరు చేశారు.