Jayam Ravi Divorce: పెళ్లయిన 15 ఏళ్లకు భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో.. ఐశ్వర్య రాయ్‌తో..
Jayam Ravi Divorce: పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు తమిళ స్టార్ హీరో జయం రవి. గతంలో ఐశ్వర్య రాయ్ తో కలిసి పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటించిన ఈ హీరో విడాకులు తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా వార్తలు రాగా.. ఇప్పుడు అతడే అధికారికంగా ప్రకటించాడు.
Jayam Ravi Divorce: స్టార్ తమిళ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోయాడు. ఈ విషయాన్ని సోమవారం (సెప్టెంబర్ 9) అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశాడు. తమిళం, ఇంగ్లిష్ భాషల్లో అతడు ఓ ప్రకటన విడుదల చేశాడు. వీళ్లు విడిపోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పుడు అతడే అధికారికంగా చెప్పడం గమనార్హం.
జయం రవి విడాకులు
గతంలో ఐశ్వర్య రాయ్ తో కలిసి పొన్నియిన్ సెల్వన్ 1, 2 సినిమాల్లో జయం రవి నటించిన విషయం తెలిసిందే. ఓవైపు ఆమె తన భర్త అభిషేక్ తో విడిపోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటు జయం రవి విడాకుల వార్తలు ప్రముఖంగా నిలుస్తున్నాయి. కొన్ని నెలల కిందట ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి రవి ఫొటోలను డిలీట్ చేయడంతో వీళ్లు విడిపోతున్నట్లు పుకార్లు మొదలయ్యాయి.
ఇప్పుడు జయం రవి అధికారికంగా తాము విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. "మీ ప్రేమకు, అర్థం చేసుకునే మనసులకు ధన్యవాదాలు" అనే క్యాప్షన్ తో ఇంగ్లిష్, తమిళం భాషల్లో తన స్టేట్మెంట్ ను అతడు పోస్ట్ చేశాడు.
ఎందుకు విడిపోతున్నామంటే?
ఈ ప్రకటనలో తాను భార్య ఆర్తితో విడిపోతున్న విషయాన్ని జయం రవి వెల్లడించాడు. "ఎంతో బాధతో మీతో నా వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. ఎన్నో చర్చలు, ఆలోచనల తర్వాత ఆర్తితో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను. తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాల వల్ల, అందరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను" అని రవి వివరించాడు.
తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని కూడా అతడు కోరాడు. "ఈ కష్ట సమయంలో మీ అందరూ నాతోపాటు మా కుటుంబ సభ్యుల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాను. మీకు మీరుగా ఎలాంటి అంచనాలకు వచ్చేసి పుకార్లు పుట్టించవద్దు. ఈ విషయాన్ని ప్రైవేట్ గానే ఉంచండి" అని రవి అన్నాడు.
15 ఏళ్ల తర్వాత ఇలా..
జయం రవి, ఆర్తి జూన్ 2009లో పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. పెళ్లయిన ఇన్నేళ్లకు వీళ్లు విడిపోవడం అంతుబట్టని విషయమే. తమ మధ్య విభేదాలకు కచ్చితమైన కారణాన్ని జయం రవి వెల్లడించలేదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉన్నా తాను తన అభిమానులకు వినోదాన్ని పంచుతూనే ఉంటానని కూడా ఈ ప్రకటనలో అతడు చెప్పాడు.
"నా సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికే ఎప్పుడూ నా తొలి ప్రాధాన్యత. నేను అప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడూ మీ జయం రవినే. ఎన్నో ఏళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు నేను రుణపడి ఉంటాను" అని రవి అన్నాడు.
1993లో వచ్చిన బావ బామ్మర్దితోపాటు పల్నాటి పౌరుషంలాంటి తెలుగు సినిమాల్లో బాల నటుడిగా జయం రవి ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలోనూ అతిథి పాత్ర చేశాడు. పొన్నియిన్ సెల్వన్ రెండు సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు.