JNTU Kakinada: జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌కు ఊర‌ట‌, సింగల్‌ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ స్టే-relief to jntu kakinada registrar cj bench stays on single judge verdict ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jntu Kakinada: జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌కు ఊర‌ట‌, సింగల్‌ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ స్టే

JNTU Kakinada: జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌కు ఊర‌ట‌, సింగల్‌ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ స్టే

HT Telugu Desk HT Telugu
Jul 25, 2024 10:58 AM IST

JNTU Kakinada: జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌కు ఊర‌ట ల‌భించింది. జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌పై కేసు న‌మోదు చేసి, విచార‌ణ చేయాల‌ని సీఐడీకీ ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వులు హైకోర్టు సీజే ధ‌ర్మాస‌నం నిలుపుద‌ల చేసింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

JNTU Kakinada: కాకినాడ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్‌ యూనివ‌ర్శిటీ (జేఎన్‌టీయూ) ప‌రిధిలో అర్హత లేని 48 కాలేజీల‌కు ఆటాన‌మ‌స్ (స్వయంప్రతిపత్తి ) హోదా క‌ల్పించార‌నే ఆరోప‌ణ‌ల‌పై జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ అనుస‌రించిన తీరును హైకోర్టు సింగిల్ జ‌డ్జి ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీవ్రంగా మండిప‌డింది. ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌పై కేసు న‌మోదు చేయాల‌ని, సీఐడీ విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు అందుకుని త‌న త‌ర‌పున న్యాయ‌వాదిని నియ‌మించుకోవ‌డం, లేక‌పోతే కోర్టుకు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంపై రిజిస్ట్రార్‌పై హైకోర్టు ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఏఐసీటీఈ) ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ అప్రూవ‌ల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ (2023-24) నిబంధ‌న 7.39ని పాటించ‌కుండా, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ 48 కాలేజీల‌కు నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికేట్ (ఎన్ఓసీ)లు ఇచ్చార‌ని పేర్కొంటూ మేరీ ఇంద్ర‌జ ఎడ్యుకేష‌నల్ సొసైటీ చైర్మ‌న్ కేవీకే రావు, జోసెఫ్ శ్రీహ‌ర్ష హైకోర్టును ఆశ్ర‌యించారు. 48 కాలేజీలు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా స్వ‌యంప్ర‌తిప‌త్తి హోదా ద‌క్కించుకున్నాయ‌ని పేర్కొన్నారు. సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ), లేక‌పోతే సీఐడీతో విచార‌ణకు ఆదేశించాల‌ని వారు హైకోర్టును కోరారు.

ఈ పిటిష‌న్ విచారించిన హైకోర్టు జులై 1న కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని ప్ర‌తివాదులైన జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌తో స‌హా ప‌లువురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంత‌రం కేసును వాయిదా వేసింది. తిరిగి కేసును జులై 23 (మంగ‌ళ‌వారం) విచార‌ణ‌కు వ‌చ్చింది. హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ త‌ర్లాడ రాజ‌శేఖ‌ర్ ధ‌ర్మాస‌నం ముందు, పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది జులై 3న జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు అంద‌జేశామ‌ని, దానికి సంబంధించిన రుజువుల‌ను కోర్టుకు స‌మ‌ర్పించామ‌ని కోరిన‌ట్లు తెలిపారు.

అయితే నోటీసులు అందుకున్న‌ప్పటికీ రిజిస్ట్రార్ నుండి న్యాయ‌వాది ప్రాతినిధ్యమూ లేదు, కోర్టుకు రిజిస్ట్రార్ వ్య‌క్తిగ‌తంగా కూడా హాజ‌రుకాలేదు. దీనిపై హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ త‌ర్లాడ రాజ‌శేఖ‌ర‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ప్ర‌తివాది త‌ర‌పున ఎటువంటి స్పంద‌న రాకపోవ‌డంతో రిట్ పిటిష‌న్‌లో చేసిన వాద‌న‌ల‌ను అంగీక‌రిస్తున్న‌ట్లు భావిస్తూ పిటిష‌న్‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించారు.

జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌పై పిటిష‌న్‌లో కోరిన‌ట్లుగా కేసు న‌మోదు చేయాల‌ని, చ‌ట్టానికి అనుగుణంగా చార్జిషీట్ దాఖ‌లు చేయాల‌ని సీఐడీని ఆదేశించారు. కేసు న‌మోదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను ఈనెల 26 (శుక్ర‌వారం)న త‌మ‌కు అంద‌జేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం జ‌స్టిస్ త‌ర్లాడ రాజ‌శేఖ‌రరావు ఉత్త‌ర్వులు ఇచ్చారు.

అయితే ఈ ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ బుధ‌వారం రిజిస్ట్రార్ అత్య‌వ‌స‌రంగా హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజే) జ‌స్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌, జ‌స్టిస్ ఎన్. జ‌య‌సూర్య‌తో కూడిన దిస‌భ్య‌ ధ‌ర్మాస‌నం విచారించింది. మంగ‌ళ‌వారం హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ త‌ర్లాడ రాజ‌శేఖ‌రరావు నేతృత్వంలోని సింగిల్ జ‌డ్జి జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌కు వ్య‌తిరేకంగా ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను బుధ‌వారం సీజే జ‌స్టిస్ ధీర‌జ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం నిలుపుద‌ల చేసింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ చేస్తూ విచార‌ణ‌ను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

అయితే ఈ వివాదంపై జేఎన్‌టీయూ కాకినాడ ఇన్‌ఛార్జి వీసీ కేవీఎస్‌జీ ముర‌ళీకృష్ణ స్పందించారు. నిబంధ‌న‌ల మేరకే 48 కాలేజీల‌కు స్వయం ప్ర‌తిప‌త్తి ద‌క్కింద‌ని, జేఎన్‌టీయూ కాకినాడ త‌ర‌పున కోర్టు కేసుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ‌వాది ఉంటార‌ని తెలిపారు. ఈనెల 23న కేసు విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు హాలులో వేరే పిటిష‌న్‌కు వెళ్లి త‌మ న్యాయ‌వాది హాజ‌రుకాలేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు.

కాలేజీల‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి హోదా ఎలా ల‌భిస్తుంది?

ఈ కేసు విచారణ సందర్భంగా అసలు కాలేజీలకు స్వయంప్రతిపత్తి ఎలా లభిస్తుందని చర్చ జరుగుతోంది. కాలేజీల‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి ద‌క్కాలంటే, ఆ కాలేజీ యాజ‌మాన్యం నేరుగా యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ)కి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ద‌ర‌ఖాస్తును ఆరుగురు స‌భ్యుల క‌మిటీ ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటుంది.

గ‌త సంవత్స‌రం నుంచి నేరుగా ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి యూజీసీ అనుమ‌తి ఇచ్చింది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి కొన్ని అర్హ‌తు పెట్టింది. కాలేజీ ఏర్పడి ప‌దేళ్ల పూర్తి కావాలి. అలాగే రెండేళ్లు స్టేట‌స్ (ఎఫ్‌-2 హోదా) ఉండాలి. న్యాక్ అయినా, లేదంటే ఎన్‌బీఏ గుర్తింపు అయిన ఉండాల్సి ఉంది. అప్పుడు యూనివ‌ర్శిటీ ఎన్ఓసీ అవ‌స‌రం లేదు.

అయితే స్వ‌యంప్ర‌తిప‌త్తి హోదా పొందిన కాలేజీలు గుర్తింపు స‌ర్టిఫికేట్‌తో యూనివ‌ర్శిటీ వ‌ద్ద‌కు వ‌స్తే, యూనివ‌ర్శిటీ ఎండార్స్‌మెంట్ (ఆమోదం) ఇస్తుంది. అనంత‌రం స్వయంప్ర‌తిప‌త్తి క‌లిగిన కాలేజీ కాలేజీల‌కు సంబంధించిన‌ కార్య‌వర్గం, అక‌డ‌మిక్ కౌన్సిల్‌, బోర్డ్ ఆఫ్ స్ట‌డీస్‌, ఫైనాన్స్ క‌మిటీల్లో యూనివ‌ర్శిటీ త‌ర‌పున‌ ఒక ప్ర‌తినిధి (నామినీ)ని నియ‌మిస్తారు. అయితే 2023 వ‌ర‌కు కాకినాడ జేఎన్‌టీయూని కొన్ని కాలేజీలు ఎన్ఓసీ కోరితే, మ‌రికొన్ని కాలేజీలు నేరుగా యూజీసీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner