Chittoor crime : చిత్తూరు జిల్లాలో ఘోరం.. ముగ్గురిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం-three people died due to extra marital affairs in chittoor district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chittoor Crime : చిత్తూరు జిల్లాలో ఘోరం.. ముగ్గురిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం

Chittoor crime : చిత్తూరు జిల్లాలో ఘోరం.. ముగ్గురిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం

HT Telugu Desk HT Telugu
Sep 05, 2024 01:55 PM IST

Chittoor crime : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేత‌ర సంబంధం ముగ్గురిని బ‌లి తీసుకుంది. కుమారుడి తీరుతో మ‌న‌స్తాపం చెందిన త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. ఆ విష‌యం తెలిసి కుమారుడు, ప్రియురాలితో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ముగ్గురిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం
ముగ్గురిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం

చిత్తూరు జిల్లా శాంతిపురం మండ‌లం శిలామాకుల‌రాయి గ్రామానికి చెందిన స‌ల్లా పురెమ్మ (68).. కుమారుడు రామ‌చంద్ర (45).. అతని భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి బెంగ‌ళూరులో జీవ‌నం ఉంటున్నారు. ర‌వాణా వాహ‌నాలు న‌డుపుతున్న రామ‌చంద్రకి.. అనంత‌పురం జిల్లా హిందూపురానికి చెందిన గిరీష్ కుటుంబంతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

గిరీష్‌, ఆయ‌న భార్య శోభ (40)కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కొన్నాళ్ల‌కు గిరీష్ భార్య శోభ‌తో రామ‌చంద్ర‌కి చ‌నువు పెరిగింది. అది వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. ఈ విష‌యం ఇరు కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌డంతో.. గొడ‌వలు జ‌రిగాయి. అయినా.. రామ‌చంద్ర‌, శోభ మ‌ధ్య వివాహేత‌ర సంబంధం మాత్రం ఆగ‌లేదు. ర‌హ‌స్యంగా క‌లిసేవారు. కుమారుడు రామ‌చంద్ర ప్ర‌వ‌ర్త‌న‌ తప్పని త‌ల్లి పురెమ్మ మంద‌లించింది. అయినా రామ‌చంద్ర మాత్రం మారలేదు.

త‌ర‌చూ గొడ‌వలు అవుతున్నాయ‌ని భావించిన రామ‌చంద్ర‌, శోభ ఎక్క‌డికైనా వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగానే 15 రోజుల కింద‌ట రామ‌చంద్ర‌, శోభ ఇంటి నుంచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ ఎవ‌రికీ తెలియ‌లేదు. దీంతో శోభ భర్త గిరీష్ అటు బెంగ‌ళూరులోనూ, ఇటు హిందూపురం పోలీస్‌స్టేష‌న్‌లోనూ ఫిర్యాదు చేశారు. రామ‌చంద్ర తీరుపై మ‌న‌స్తాపానికి గురైన త‌ల్లి పురెమ్మ సోమ‌వారం శాంతిపురంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న కుమారుడు రామ‌చంద్ర, ప్రియురాలు శోభ బుధ‌వారం రామ‌కుప్పం మండలంలోని చెలిమిచేన్లు అట‌వీ ప్రాంతంలో విషం తాగి మృతి చెందారు. వారి మృతి దేహాల‌ను చూసిన ప‌శువుల కాప‌ర్లు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం కుప్పం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌లించారు. రామ‌కుప్పం పోలీసులు కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు చేస్తున్నారు. రామ‌చంద్ర భార్య‌, పిల్ల‌లు, శోభా భర్త‌, పిల్ల‌లతో స‌హా కుటుంబ స‌భ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner