Tirumala Laddu : టీటీడీలో అక్రమాలపై విచారించాలి - సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకోవాలి - పవన్ కల్యాణ్
తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలపడం అనేది నీచమైన చర్యని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడిన ఆయన…TTDలో అక్రమాలపై విచారించాలన్నారు.
తిరుమలలో జరిగిన విధంగా ఏ ధర్మంపై దాడి జరిగిన సరే గ్లోబల్ వార్త అవుతుందని, ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు ప్రసాదం అపవిత్రం అవుతుంటే మాత్రం ఎవరు మాట్లడకూడదా..? అని ప్రశ్నించారు. "మీరు సెక్యులర్ మాట్లాడకూడదు అంటే ఎలా? హిందువులకు మనోభావాలు ఉండవా? హిందువులపై దాడి జరిగితే చూస్తూ కూర్చోవాలా?' అని కామెంట్స్ చేశారు.
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడిన ఆయన… తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం అంటే అన్ని మతాలను సమానంగా చూస్తూ.. మన మతాన్ని ఆచరించడమని అన్నారు.
'తిరుమల స్వామి వారిని అపవిత్రం చేస్తాం… మీరు మాట్లాడకూడదు అంటే కుదరదు. ఖచ్చితంగా కోపాలు వస్తాయి, మేము మాట్లాడతాం. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తాం, ఖండిస్తాం, చర్యలు తీసుకుంటాం. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సూటి ప్రశ్న అడుగుతున్నాను, తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చ్ కు అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదు కు జరిగితే ఊరుకుంటావా? మరి తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదు అంటున్నారు..? మేము మాట్లాడతాం, మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం, సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడుతాను" అని పవన్ స్పష్టం చేశారు.
విచారణ జరపాలి - పవన్ కల్యాణ్
తిరుమల ఘటనలో దోషులకు శిక్ష పడాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. వైసీపీ ప్రభుత్వ హయంలో టీటీడీ లో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలని కోరారు.
“నిన్న మీడియా ప్రతినిధులు CBI కి తీసుకువెళ్తారా అని అడిగారు. క్యాబినెట్ లో చర్చ జరిగే విధంగా చూసి, దీనిపై నిర్ణయం తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. తిరుమలలో జరిగిన ఘటన ఇంకెప్పుడు భవిష్యత్తులో జరగకుండా చూసేలా మా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని హామీ ఇస్తున్నాను” అని పవన్ చెప్పారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు పవన్ కల్యాణ్. ఇది హిందూ ధర్మంపై జరిగిన దాడిగా భావిస్తున్నానని చెప్పారు. దీనిని అందరూ మతాలకు అతీతంగా ఖండించాలని కోరారు. ఆశ్రయం ఇచ్చిన స్వామి వారికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకపోవటం టీటీడి లో పనిచేస్తున్న హిందువులు కూడా తప్పు చేసినట్లే అవుతుందన్నారు.
“హిందువులు అందరికీ పిలుపునిస్తున్నాను. ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి, మీ మతాన్ని గౌరవించడం ప్రతీ హిందువు నేర్చుకోవాలి, తప్పులను ఖండించాలి. బయటకు వచ్చి పోరాడాలి. నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి” అని అన్నారు.
సంబంధిత కథనం