Animal fat in Ghee: తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి, నెయ్యిలో ఏఏ జంతువుల కొవ్వును కలిపి కల్తీ చేస్తున్నారు?
Animal fat in Ghee: తిరుపతి లడ్డూ వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, తిరుపతి దర్శించిన ప్రతి భక్తుడికి షాక్ ఇచ్చింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిని వాడినట్టు ల్యాబ్ నివేదికలు నిర్ధారించాయి.
Animal fat in Ghee: మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో తిరుపతి ఒకటి. తిరుపతి వెళ్ళినవారు లడ్డూ ప్రసాదాన్ని తీసుకోకుండా వెనక్కి రారు. ఆ లడ్డూను తెచ్చి తాము తినడంతో పాటు, తమ చుట్టూ ఉన్న వారికి కూడా పంచుతారు. ఇలాంటి భక్తులందరికీ షాక్ ఇచ్చేలా తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యిని వాడారని, అది కూడా జంతువులను తీసిన కొవ్వులకు వాడినట్టు ల్యాబ్ నివేదిక బయటపెట్టింది. గుజరాత్‌లోని ల్యాబ్‌లో తిరుపతి లడ్డూలను పరిశీలించారు. అక్కడ తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు బయటపడింది. తెలిసిన తర్వాత తిరుపతి లడ్డూ తిన్న ప్రతి భక్తుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు నెయ్యిని ఎలా కల్తీ చేస్తారో, నెయ్యిలో ఏ జంతువుల కొవ్వులను కలుపుతారో తెలుసుకోండి.
ఎంత పాలతో ఎంత నెయ్యి?
నెయ్యిని పాల నుండి తయారుచేస్తారు. పాలకు చెందిన ఉప ఉత్పత్తి నెయ్యి. పాలను పెరుగుగా మార్చి ఆ పెరుగును మజ్జిగగా చేసి, ఆ మజ్జిగను చిలకడం ద్వారా వెన్నను వేరు చేస్తారు. ఆ వెన్నను స్టవ్ మీద పెట్టి కాచి నెయ్యిని తయారు చేస్తారు. 40 లీటర్ల పాల నుండి పెరుగును తయారు చేస్తే ఇక్కడ చెప్పిన ప్రక్రియలో నెయ్యి కేవలం ఒక కిలో మాత్రమే లభిస్తుంది. అందుకే నెయ్యి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మరి కొందరు పాల పైన వచ్చిన మీగడను తీసి ఆ మీగడతో నెయ్యిని చేస్తారు. పాల మీద వచ్చే మీగడ చాలా తక్కువగా ఉంటుంది. ఎన్నో రోజులు పాటు ఆ మీగడను సేకరించిన తయారు చేయాల్సి వస్తుంది. అందుకే నెయ్యి ఖరీదు మార్కెట్లో అధికంగానే ఉంటుంది, కానీ తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి ఖరీదు చాలా తక్కువ. ఇంత తక్కువ ఖరీదుతో నెయ్యిని ఎలా అందిస్తున్నారో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేశారు. అందులో ఆ నెయ్యి పూర్తిగా కల్తీదని తేలిపోయింది.
లడ్డూలో పందికొవ్వు ఎలా?
తిరుపతి లడ్డులో పంది కొవ్వు జాడలు ఉన్నాయని నివేదిక వచ్చింది. అలాగే చేప నూనె, బీఫ్ టాలో కూడా ఉన్నట్టు గుర్తించారు. ఎక్కువగా పంది కొవ్వు కణజాలమే కనిపించింది. ఆవు లేదా పందిలో చర్మం కింద ఉండే కొవ్వును కరిగించి వేరు చేస్తారు. దాన్ని నెయ్యిలో కలుపుతారు. ఇది ఎలాంటి సువాసనను వేయదు, కానీ కరిగించడం వల్ల నెయ్యి ఆకృతిని పొందుతుంది. దీన్ని నెయ్యిలో కలిపేస్తే ఎలాంటి తేడా కూడా గుర్తించలేరు. అందుకే ఇన్నాళ్లు తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు కనిపెట్టలేకపోయారు.
స్వచ్ఛమైన నెయ్యిని ఎలా కనిపెట్టాలి
స్వచ్ఛమైన నెయ్యి గది ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతుంది. గడ్డకట్టిన నెయ్యిని తీసి అరచేతిలో పెట్టుకోండి. అలా కొన్ని సెకన్లు ఉంచితే అది మన చేతి వేడికి కరగడం మొదలవుతుంది. అలా కరిగితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం.
మరొక పరీక్ష ద్వారా కూడా నెయ్యి కల్తీదో, మంచిదో తెలుసుకోవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద ఒక గ్లాసులో నీళ్లు వేసి పెట్టాలి. అందులో ఒక చుక్క నెయ్యిని వేయాలి. కొన్ని సెకన్ల తర్వాత ఆ నెయ్యి తేలితే స్వచ్ఛమైనదని అర్థం. అలా కాకుండా ఆ నెయ్యి చుక్క మునిగిపోతే దానిలో కల్తీ పదార్థాలు కలిసాయని అర్థం చేసుకోవాలి. అలాగే నెయ్యిని వేడి చేసినప్పుడు అది కరిగిపోవాలి, కానీ బుడగలు రావడం, ఆవిరి రావడం వంటివి చేయకూడదు. అలా వస్తే అది కల్తీ నెయ్యి అని అర్థం.
ఇంట్లోనే నెయ్యి తయారీ
బయటకొనే నెయ్యిని నివారించడమే మంచిది. ఇంట్లోనే కాస్త ఓపికగా నెయ్యిని తయారు చేసుకుంటే శుచిగా, రుచిగా ఉంటుంది. బయట దొరికే మార్కెట్లో మన శరీరానికి హాని చేసే ఎన్నో పదార్థాలలో కలుపుతున్నారు. జంతువుల కొవ్వును తీసి దాన్ని బాగా స్టౌ మీద పెట్టి కరిగించి దానిని నెయ్యిలో కలపడం వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పంది కొవ్వును కూడా నెయ్యిలో కలపడం వల్ల ప్రమాదకరమైన రోగాల బారిన పడతాము. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే పాల మీగడతో లేదా వెన్నతో నెయ్యిని కాచుకొని వాడితే ఉత్తమం.
టాపిక్