Pawan Kalyan : ఏడుకొండలవాడా క్షమించు, తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష-tirumala laddu adulteration issues deputy cm pawan kalyan 11 days deeksha ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : ఏడుకొండలవాడా క్షమించు, తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష

Pawan Kalyan : ఏడుకొండలవాడా క్షమించు, తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష

Bandaru Satyaprasad HT Telugu
Sep 21, 2024 09:07 PM IST

Pawan Kalyan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల వికృత చర్యల ఫలితంగా తిరుమల లడ్డూ ప్రసాదం అపవత్రమైందని పవన్ అన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు.

ఏడుకొండలవాడా క్షమించు, తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష
ఏడుకొండలవాడా క్షమించు, తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష

Pawan Kalyan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఏడుకొండలవాడా క్షమించు అని ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. జంతు అవశేషాలతో మలినమైందన్నారు. ఈ పాపాన్ని ముందుగా పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం అన్నారు.

లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్ అన్నారు. అపరాధ భావానికి గురైందన్నారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి చర్య తన దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అన్నారు. అందులో భాగంగా తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

"సెప్టెంబర్ 22, 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను"- పవన్ కల్యాణ్

తీవ్ర క్షోభకు గురయ్యా

భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తన బాధేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం అని ఆవేదన చెందారు. నాటి పాలకులకు భయపడి నోరు విప్పకుండా ఉండిపోయారా? అనిపిస్తోందన్నారు.

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధమైన చర్యలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసిందన్నారు. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే సమయం ఆసన్నమైందన్నారు. ధర్మో రక్షతి రక్షితః అంటూ ట్వీట్ చేశారు.

తిరుమలలో మూడు రోజుల పాటు సంప్రోక్షణ యాగం

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదంలో వినియోగించారని కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారం కారణంగా సంప్రోక్షణకు శ్రీకారం చుట్టింది.

తిరుమలలో మూడు రోజుల పాటు మహా శాంతియాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆనంద నిలయంలో మహా శాంతియాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు. ఆ యాగంలో వేద పండితులతోపాటు రుత్వికులు పాల్గొనున్నారు.

సంబంధిత కథనం