Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన షర్మిల.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదం.. ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్‌లోకి తాజాగా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. తిరుమలను అపవిత్రం చేస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్.. పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా టీటీడీతో గతంలో సంబంధం ఉన్న వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. టీటీడీ ఈవో కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం టాక్ అఫ్ ది నేషన్‌గా మారింది. ఈ నేపథ్యం లో.. ఈ వివాదంపై స్పందించారు వైఎస్ షర్మిల.
'తిరుమలను అపవిత్రం చేస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి' అని షర్మిల ఆక్షేపించారు.
'చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం.. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే.. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. సీబీఐతో విచారణ జరిపించండి. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది' అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారం పై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఇష్యూపై మాజీ సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. అంటే మధ్యాహ్నం 3 గంటలకే.. టీటీడీ ఈవో కూడా మీడియాతో మాట్లాడననున్నారు. దీంతో ఏపీలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఇద్దరు ఒకే సమయంలో మీడియాతో మాట్లాడతారనే సమాచారం హాట్ టాపిక్‌గా మారింది. అటు జగన్ ఈ వ్యవహారంపై ఏం మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ విషయానికి సంబంధించి మాజీ సీఎం జగన్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. న్యాయవాది వినీత్ జిందాల్ జగన్‌పై ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ హిందువుల ఆత్మను హత్య చేశారని వినీత్ జిందాల్ వ్యాఖ్యానించారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారని ఆరోపించారు. కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ పాల్పడ్డారని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు.