YS Jagan Vs Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం రద్దు- వైఎస్ జగన్ విమర్శలు, మంత్రి లోకేశ్ కౌంటర్
YS Jagan Vs Lokesh : కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ రద్దు చేశారన్నారు. జగన్ విమర్శలకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈకి విద్యార్థులను సిద్ధం చేస్తామన్నారు.
YS Jagan Vs Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ రద్దుతో చంద్రబాబు ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. పేద పిల్లల నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారన్నారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి? ప్రశ్నించారు.
"గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు" -వైఎస్ జగన్
ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టించడానికేనా?
గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుట్రను అమలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? అదేనా మీ ఉద్దేశం అంటూ ప్రశ్నించారు. తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంతజేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలని నిలదీశారు. గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరన్నారు.
ప్రభుత్వం స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువకాదని వైఎస్ జగన్ అన్నారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణ కూడా పొందినవారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారి కంటే గొప్పచదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారన్నారు. అలాంటి వారిని తక్కువగా చూసే ప్రవర్తనను మార్చుకోవాలని వైఎస్ జగన్ హితవు పలికారు. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన అన్నారు. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్ అని, గడచిన ఐదేళ్లలో ఈ దిశగా ఎంతో ప్రయాణం చేశామన్నారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు ప్రశ్నించారు.
మంత్రి లోకేశ్ కౌంటర్
వైఎస్ జగన్ ట్వీట్ కు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. "ఏం చదివారో తెలియదు..ఎక్కడ చదివారో అస్సలు తెలియదు. మీరు విద్యశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది" అని మంత్రి లోకేశ్ అన్నారు.
నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబిఎస్ఈ లో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టారని మండిపడ్డారు. వైసీపీ.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో చెప్పాలని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు.
సంబంధిత కథనం