Lokesh Wishes to NBK: ‘బాల మామయ్యా...సరిలేరు నీకెవ్వరయ్యా..’ - నారా లోకేశ్ విషెష్
ఇవాళ్టితో హీరో బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులతో పాటు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో ఆయన మేనల్లుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. ‘బాల మామయ్యా..సరిలేరు నీకెవ్వరయ్యా!’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మేనల్లుడు, మంత్రి నారా లోకేశ్…విషెష్ చెప్పారు. ‘బాల మామయ్యా..సరిలేరు నీకెవ్వరయ్యా!’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
50 ఏళ్లుగా వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలుగుతూ ఉన్న మా బాల మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘తాతమ్మకల’తో 1974వ సంవత్సరంలో తెరంగేట్రం చేసిన మామయ్య వేయని పాత్ర లేదు.. చేయని ప్రయోగం లేదు. ఐదు దశాబ్దాలలో హీరోగా 109 సినిమాలలో నటించి అవార్డులు-రివార్డులు అందుకుని రికార్డు సృష్టించారు" అని పేర్కొన్నారు.
“ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినిమాలతో గాడ్ ఆఫ్ మాసెస్ గా బాల మామయ్య పేరుగాంచారు. సాంఘిక, పౌరాణిక, వినోద ప్రధానమైన చిత్రాలలో హీరోగా నటించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. అగ్రహీరోగా వెలుగొందుతూనే.. రాజకీయాల్లో రాణిస్తూ..సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సులు గెలుచుకున్న అన్ స్టాపబుల్ హీరో మా బాల మామయ్య..” అంటూ లోకేశ్ తన పోస్టులో ప్రస్తావించారు.
మండపాల అనుమతులకు వెబ్ సైట్ - మంత్రి లోకేశ్
ఇక వినాయకచవితి వేడుకలపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించినట్లు తెలిపారు. https://ganeshutsav.net ద్వారా వినాయక మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ వెబ్ సైట్ ను ఉపయోగించుకోవాలని కోరారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల ఆందోళనపై లోకేశ్ స్పందించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించామన్నారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవుని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.