YS Jagan in Nandyal : చంద్రబాబు, లోకేశ్ పై కేసులు పెట్టాలి.. లేకపోతే లా అండ్ అర్డర్ ఉండదు - వైఎస్ జగన్-ys jagan demanded to register cases against chandrababu lokesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan In Nandyal : చంద్రబాబు, లోకేశ్ పై కేసులు పెట్టాలి.. లేకపోతే లా అండ్ అర్డర్ ఉండదు - వైఎస్ జగన్

YS Jagan in Nandyal : చంద్రబాబు, లోకేశ్ పై కేసులు పెట్టాలి.. లేకపోతే లా అండ్ అర్డర్ ఉండదు - వైఎస్ జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 09, 2024 08:18 PM IST

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారని ఆరోపించారు. సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… సీఎం చంద్రబాబు, లోకేశ్ పై సీరియస్ కామెంట్స్ చేశారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్

నంద్యాల జిల్లాలోని సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన…కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని… మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన అమలు చేస్తున్నారన్నారు. పూర్తిగా లా అండ్‌ ఆర్డర్‌ నాశనం చేస్తున్నారని… పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేశారు.

ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు. దీనిలో రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత కూడా గ్రామానికి అడిషనల్‌ ఫోర్స్ ఎందుకు రాలేదు? హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు? ప్రతి ఊరిలో ఇద్దరు వైయస్ఆర్ సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నాడు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంపిన వాళ్ల మీదనే కాకుండా రెచ్చగొడుతున్న ఎమ్మెల్యేల మీద వారికి సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు, నారా లోకేశ్ ను కూడా కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలి" అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

కోర్టులను ఆశ్రయిస్తాం - వైఎస్ జగన్

“రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన సాగుతోంది. వైసీపీ కార్యకర్తలు, నాయకులే టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ గూండాలు హత్యలకు పాల్పడుతున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. హత్యలు చేసినవారికే కాదు, చేయించినవారినీ కఠినంగా శిక్షించాలి” అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

దాడులకు, హత్యలకు మద్దతు ఇస్తున్న వారినీ ముద్దాయిలుగా చేరిస్తే తప్ప రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బతకదని జగన్ వ్యాఖ్యానించారు.సీతారామాపురంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే సుబ్బారాయుడి హత్య జరగడం బాధాకరమని చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. అవసరం అయితే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామన్నారు. “మా కార్యకర్తలందరినీ రక్షించుకుంటాం. పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాను” అని జగన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Whats_app_banner