Tiruchanoor Brahmotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు- ఆర్జిత, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-tiruchanoor karthika brahmotsavam nov 26 to dec 8 arjitha vip break darshan cancelled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tiruchanoor Brahmotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు- ఆర్జిత, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tiruchanoor Brahmotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు- ఆర్జిత, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Bandaru Satyaprasad HT Telugu
Nov 24, 2024 06:27 PM IST

Tiruchanoor Brahmotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు- ఆర్జిత, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు- ఆర్జిత, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 28 నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాల‌ను పుర‌స్కరించుకుని న‌వంబ‌రు 26న‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ప‌ద్మావ‌తి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి స‌హ‌స్రనామార్చన నిర్వహిస్తారు. ఆ త‌రువాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడ‌తారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

నవంబరు 27న లక్ష కుంకుమార్చన

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 27న ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్ద గల కౌంటర్‌లో కరెంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

న‌వంబ‌రు 27న అంకురార్పణ

న‌వంబ‌రు 27వ తేదీ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవలు

  • 28.11.2024 : ఉ. 9.00 – ఉ.9.30 ధ్వజారోహణం, రాత్రి 7.00 – 9.00 చిన్నశేష వాహనం
  • 29.11.2024 : ఉ. 8 – గం.10 పెద్దశేష వాహనం, రాత్రి 7 – 9 హంసవాహనం
  • 30.11.2024 : ఉ. 8 – 10 ముత్యపు పందిరి వాహనం, రా. 7- 9 సింహవాహనం
  • 01.12.24 : ఉ. 8 – 10 కల్పవృక్ష వాహనం, రా. 7 – 9 హనుమంత వాహనం
  • 02.12.24 : ఉ. 8 – 10 పల్లకి వాహనం, రా. 7 – 9 గజ వాహనం
  • 03.12.24 : ఉ. 8 – 10 సర్వభూపాల వాహనం, సా.4.20 – 5.20 స్వర్ణ రథోత్సవం, రా. 7 – 9 గరుడ వాహనం
  • 04.12.24 : ఉ. 8 – 10 సూర్య ప్రభ వాహనం, రా. 7 – 9 చంద్రప్రభ వాహనం
  • 05.12.24 : ఉ. 8 – 10 రథోత్సవం, రా. 7 – 9 అశ్వవాహనం
  • 06.12.24 : ఉ. 7 – 8 పల్లకీ ఉత్సవం, మ.12.15 – 12.20 పంచమి తీర్థం, రాత్రి: ధ్వజావరోహణం
  • 07.12.2024 : సాయంత్రం – పుష్పయాగం

ఈ నెల 25న విశాఖలో టీటీడీ కార్తీక దీపోత్సవం

టీటీడీ, హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ (సోమవారం) సాయంత్రం 5:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. వైజాగ్‌లోని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వేంకటేశ్వరుని అనుగ్రహం పొందాలని టీటీడీ భక్తులను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వరుని పంచలోహ విగ్రహాలకు పూజలు నిర్వహించనున్నారు. అలాగే సంప్రదాయ వైదిక ఆచారాలను అనుసరించి టీటీడీ అర్చకులు పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్తీక దీపోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ కార్తీక దీపోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని టీటీడీ కోరుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం