AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!-ministry of home affairs has granted permission to prosecute former ap intelligence head ab venkateswara rao ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ab Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
May 12, 2024 07:09 AM IST

AB Venkateswara Rao Prosecution : ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణకు అనుమతి
ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణకు అనుమతి

Ex AP intelligence head AB Venkateswara Rao: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో కేసు నమోదు చేసి విచారించేందుకు కేంద్రహోంశాఖ ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

ఏబీ వెంకటేశ్వరరావు పదవిలో ఉన్నపుడు నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఐపీఎస్ కావటంతో విచారించేందుకు కేంద్రహోంశాఖ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో…. ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు ఈ కేసుకు సంబంధించిన పలు వివరాలను సమర్పించింది.

ఈ వివరాలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ…ఏబీ వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ కు ఇటీవలే అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు తాజాగా వెలుగు చూశాయి. మే 2వ తేదీన ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్రంహోంశాఖ అనుమతి నేపథ్యంలో… త్వరలోనే అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్‌ ప్రారంభం కానుంది.

తెలుగుదేశం హయాంలో ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలో సెక్యూరిటీ పరికరాల కొనుగోళ్లులో ఆయన అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి రావడంతో ఏబీవీ విచారణకు లైన్‌ క్లియర్ అయినట్లు అయింది.

ఇటీవలే క్యాటీ కీలక ఆదేశాలు….

AB Venkateswararao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఇటీవలే ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‍లో సవాల్ చేశారు.

వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయండం న్యాయ విరుద్దమని క్యాట్ అభిప్రాయపడింది. ఆయనను వెంటనే సర్వీస్ లోకి తీసుకుని రావాల్సిన ఎరియర్స్ మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీవీ సస్పెన్షన్ చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని క్యాట్ అభిప్రాయపడింది.

టీడీపీ ప్రభుత్వంలో రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా క్యాట్ సస్పెన్షన్ ను సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏబీవీ సస్పెన్షన్ ను కొట్టివేసింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉంచవద్దని ఆదేశిస్తూ... ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంది. అయితే కొంతకాలానికి తిరిగి అదే కారణం చెబుతూ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన మళ్లీ క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం క్యాట్ .. ఇటీవలే తుది తీర్పును ప్రకటించింది.

అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఇంటిలిజెన్స్ విభాగపు అధిపతిగా సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును గతంలో సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది. కేంద్ర హోం శాఖ కూడా దీనిని ధ్రువీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావును శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.

ప్రాసిక్యూషన్ కు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో…. ఏపీ ప్రభుత్వం మరోసారి క్యాట్ లో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇటీవలే ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Whats_app_banner