ABVP Protest: ఏబీవీపీ కార్యకర్తపై పోలీసుల దాడి, జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్
ABVP Protest: అగ్రికల్చర్ యూనివర్శిటీ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్ధులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం వైరల్‌గా మారింది. విద్యార్ధిని జుట్టు పట్టి లాగడంతో కింద పడిపోయింది.
ABVP Protest: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించ వద్దని ఏబీవీపీ విద్యార్ధుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 55ను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి.
బుధవారం కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదుట శాంతియుతంగా నిరసనలు జరిగాయి. ఈ క్రమంలోనే మధ్యహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఒక విద్యార్థిని నాయకురాలు యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని నిరసన తెలిపింది. పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టి పరిగెత్తుతున్న విద్యార్థిని నాయకురాలును వెంబడించారు. బైక్ పై వెళుతున్న ఇద్దరు మహిళా పోలీసులు విద్యార్ధిని జుట్టును పట్టుకొని లాగడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది.
కింద పడిన యువతి జుట్టు వదలకుండా ముందుకు లాక్కేలారు. దీంతో ఆమె చేతులు, కాళ్లు, శరీరం ముందు భాగంలో గాయాలయ్యాయి. ఇదేం పద్ధతి అనే బాధితులు కంటతడి పెట్టుకుంటూ ప్రశ్నించడంతో ..... ఇట్లనే ఉంటది మరి అంటూ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది " ఈ దృశ్యాలన్నీ మరో విద్యార్థిని ఫోన్ లో చిత్రీకరించడంతో అవి వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. " వర్సిటీ భూములను హై కోర్టుకు కేటాయించకూడదు అని శాంతియుతంగా నిరసన చేసినందుకు విద్యార్థుల పై ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని,మహిళా కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు". ఈ ఘటనపై ABVP రాష్ట్ర కార్యదర్శి ఝాన్సి స్పందించారు.అమ్మాయి అని కూడా చూడకుండా అంతా దారుణంగా ఈడ్చు కెళ్ళడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థిని నాయకులను గుండాలుగా చూస్తారా? అంటూ ఆమె మండిపడ్డారు.నాటి తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా విద్యార్థులపై పోలీసుల కండ కావరం ఇలానే ఉండేదని ఆమె గుర్తు చేశారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం,డీజీపీ స్పందించి మహిళా కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
పోలీసులు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్సీ కవిత
ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతిపై తెలంగాణ పోలీసుల ప్రవర్తన తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు.ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం వెంటనే స్పందించి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మరోవైపు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు.
(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)