IPS ABV Issue : ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ప్రభుత్వ పంతం నెగ్గేనా…?
ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో వివాదం కొనసాగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు ఇంక్రిమెంట్లు కట్ చేస్తే సరిపోతుందని కేంద్రం సూచించింది.
IPS ABV Issue ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేసింది. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు 2024 మే 31 వరకూ రెండు ఇంక్రిమెంట్లు నిలిపేయాలని సూచించింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి లేఖ అందింది.
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ అధిపతి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడానికి, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడానికి వీల్లేదని స్పష్టం కేంద్రం చేసింది. ఆయనపై చర్యలుగా 2024 మే 31వ తేదీ వరకూ రెండు ఇంక్రిమెంట్లు మాత్రం నిలిపేయాలని సూచించింది. ఈ మేరకు చర్య తీసుకుని ఆ విషయాన్ని తమకు తెలియ జేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. . ఈ మేరకు కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ సంజీవ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను పంపారు.
కేంద్ర హోం శాఖ నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డికి జనవరి 10న లేఖ రాశారు. తాజాగా ఈ లేఖ వెలుగుచూసింది. భద్రత, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలంటూ 2021 డిసెంబరు 16న కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. గత రెండేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తేసినా మళ్లీ ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది.
ఏబీ వెంకటేశ్వరరావును శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ మేరకు పెనాల్టీ విధించాలో సూచించాలో కూడా కేంద్ర హోంశాఖ సూచించింది. మరోవైపు ఏబీని విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీని గతేడాది ఫిబ్రవరిలో కోరింది. దీంతో రెండు ఇంక్రిమెంట్లు మాత్రమే నిలిపేయాలని యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ డిస్మిస్ చేయడానికి యూపీఎస్సీ సిఫార్సు చేయలేదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. అటు ఏబీ వెంకటేశ్వరరావు ఈ నిర్ణయాన్ని క్యాట్‌లో సవాలు చేస్తానని ప్రకటించారు.
టాపిక్