Pawan on TTD: సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలంటున్నడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏ ప్రమాణానికైనా సిద్ధమన్న లోకేష్‌-deputy cm pawan kalyan wants sanatana dharma rakshasan board scandal over ttd laddu prasads ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan On Ttd: సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలంటున్నడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏ ప్రమాణానికైనా సిద్ధమన్న లోకేష్‌

Pawan on TTD: సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలంటున్నడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏ ప్రమాణానికైనా సిద్ధమన్న లోకేష్‌

Pawan on TTD: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ స్పందించారు. జాతీయ స్థాయిలో సనాతన దర్మపరిరక్షణ కోసం బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అక్రమాలపై కఠిన చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యతపై దుమారం కొనసాగుతోంది.

Pawan on TTD: తిరుమల తిరుపతి ఆలయ ప్రాసదంలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్టు ల్యాబ్‌ రిపోర్టులు వెలుగు చూడటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ స్పందించారు. ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కలిపిన విషయంల తెలిసి అంతా తీవ్రమైన కలత చెందామని పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని, ఈ విషయంలో సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ ప్రకటించారు.

మరోవైపు ఇది దేవాలయాల అపవిత్రత, వాటికి ఉన్న భూమి సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చిందన్నారు.

మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ చెప్పారు.

జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా అన్ని వర్గాలలో ఈ విషయంలో చర్చ జరగాలన్నారు. ‘సనాతన ధర్మాన్ని’ ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి మనమందరం కలిసి రావాలని నేను భావిస్తున్నట్టు చెప్పారు.

ఆరోపణలు తప్పైతే వేంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు..

మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదాలపై వచ్చిన ఆరోపణలకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి చెప్పింది అబద్దమైతే వారు తప్పకుండా వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురవుతారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్వామిపై భక్తిలేని వారే ఇలాంటి పని చేస్తారని మండిపడ్డారు.

వేంకటేశ్వర స్వామిపై భక్తిలేని ముస్లిం అధికారిని విచారణ అధికారిగా నియమించుకుని తనకు అనుకూలంగా నివేదిక తెప్పించుకున్నారని భూమన ఆరోపించారు. స్వామి వారి భక్తులు ఎవరు ఈ పని చేయరని, ఈ నివేదిక అర్థరహితమన్నారు.

కరీముల్లా షరీఫ్‌ అనే విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లేకపోతే చంద్రబాబు ఇంతటి ఆరోపణ చేయరని మండిపడ్డారు.దీనిపై ఎంతవరకైనా పోరాడతామన్నారు.

ఏ ప్రమాణానికైనా సిద్ధమన్న లోకేష్…

లడ్డూ ప్రసాాదాల వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాలుకు తాను సిద్దమని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. వైసీపీ హయంలో సామాన్యులు దేవుడి దగ్గరకు వెళ్లకుండా చేశారని, అడ్డగోలుగా అన్ని ధరలు పెంచారని, ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, రిపోర్టులు వచ్చాక కూడా ఇంకా ఎందుకు భయపడాలన్నారు. గతంలో వైవీ సుబ్బారెడ్డి తమపై పింక్‌ డైమండ్ అంటూ ఆరోపణలు చేశారని, అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏమి చేశారని ప్రశ్నించారు. తామెవరికి భయపడాల్సిన అవసరం లేదని లోకేష్‌ అన్నారు.

కమిషన్ల కోసం రాజీపడ్డారు.. బీజేపీ

తిరుమల ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో నాణ్యత లేకున్నా ఎందుకు రాజీ పడ్డారని, కమిషన్ల కోసం రాజీపడ్డారని బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో ప్రసాదాల తయారీకి రోజుకు 14టన్నుల ఆవునెయ్యిని వినియోగిస్తున్నారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాణ్యమైన నెయ్యి వినియోగిస్తున్నామన్నారు. గతంలో ఎడిబుల్‌ ఆయిల్స్‌ కలుస్తున్నాయని, పూర్తి స్థాయిలో విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టిందని, వాస్తవాలు ప్రజల ముందు పెడతామని చెప్పారు. తిరుమల అక్రమాలకు సంబంధించి రూ500కోట్లు చేతులు మారాయని ప్రాథమిక ఆదారాలు లభించాయని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. తిరుమలలో కనీసం నెయ్యిలో కల్తీ జరగకుండా రూ.75 లక్షలతో ల్యాబ్‌ పెట్టుకోలేకపోయారని టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు.