Tirumala Laddu Issue : లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం.. చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్న ఈవో-emergency meeting of ttd officials on laddu dispute ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Laddu Issue : లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం.. చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్న ఈవో

Tirumala Laddu Issue : లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం.. చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్న ఈవో

Basani Shiva Kumar HT Telugu
Sep 21, 2024 02:50 PM IST

Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. చంద్రబాబు కామెంట్స్‌తో మొదలైన లడ్డూ వివాదం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా.. లడ్డూ వివాదంపై టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ సలహాదారులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. దీనిపై ఈవో చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు.

లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం
లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం

లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీ అయ్యారు. ఆలయం సంప్రోక్షణపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాన అర్చకుడు, పండితులతో టీటీడీ ఈవో చర్చలు జరుపుతున్నారు. దీనిపై చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, అధికారులు, సలహాదారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేయనున్నారు.

లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక కేజీ ఆవు నెయ్యిరూ. 320 నుంచి రూ.411కే మధ్య ఉన్న రేటుకే ఎలా వస్తుందని తమకు అనుమానం వచ్చిందని ఈవో చెప్పారు. నెయ్యి చూస్తే నూనెలాగా ఉండేదని.. ఈ అనుమానంతోనే టెస్టింగ్ చేయించామని వెల్లడించారు. నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపామని చెప్పారు. నెయ్యి నాణ్యత లేదని.. కల్తీ జరిగినట్టు నివేదికలు వచ్చాయన్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని స్పష్టం చేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారి మ‌హా ప్ర‌సాదం ల‌డ్డూ త‌యారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు క‌లిపిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర నివేదికను ఇవ్వాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌. చంద్ర‌బాబునాయుడిని కోరారు.

కల్తీ నెయ్యి వ్యవహారం ఓ కట్టు కథ అని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెయ్యి సప్లై చేసిన ప్రతీ ట్యాంకర్.. నెయ్యితో పాటు.. ఎన్ఏబీఎల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారని.. ఆ తర్వాత టీటీడీలో 3 శాంపిల్స్ తీసుకొని.. మూడు టెస్టులు చేస్తారని జగన్ వివరించారు. ఆ తర్వాతనే ఆ నెయ్యిని ప్రసాదంలో వాడతారని చెప్పారు. ఈ ప్రాసెస్ జరగపోతే.. అసలు ఆ ట్యాంకర్ ముందుకెళ్లదని.. రిజెక్ట్ అయిన నెయ్యిని అసలు వాడరని స్పష్టం చేశారు. వాడని నెయ్యిని అడ్డంగా పెట్టుకొని.. ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని జగన్ ప్రశ్నించారు.

తిరుమల లడ్డూ ఇష్యూపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. 'కలియుగ ప్రత్యక్ష దైవం, వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో.. శ్రీవారికి ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతోపాటు.. కల్తీ అయిన నెయ్యిని, చేప నూనెను వినియోగించారని కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోంది' అని సంజయ్ లేఖలో ప్రస్తావించారు.