CM Chandrababu : గోదాట్లో మునిగిన పోలవరం మళ్లీ గట్టెక్కింది, 2027కు తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు-amaravati cm chandrababu thanked union govt for funds allocated to polavaram project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : గోదాట్లో మునిగిన పోలవరం మళ్లీ గట్టెక్కింది, 2027కు తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు

CM Chandrababu : గోదాట్లో మునిగిన పోలవరం మళ్లీ గట్టెక్కింది, 2027కు తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2024 07:11 PM IST

CM Chandrababu : గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్లీ గట్టెక్కిందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరానికి రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఆపన్నహస్తం అందించిందన్నారు.

గోదాట్లో మునిగిన పోలవరం మళ్లీ గట్టెక్కింది, 2027కు తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు
గోదాట్లో మునిగిన పోలవరం మళ్లీ గట్టెక్కింది, 2027కు తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు

CM Chandrababu : కేంద్ర కేబినెట్ ఏపీకి నిధులు ఇవ్వడానికి అంగీకరించడం సంతోషదాయకమని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఈ సాయం కొంత వెసులుబాటు కల్పిస్తుందన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే ముందు ఏపీ ఖర్చు చేసిన రూ.4730 కోట్లను కేంద్రం రాష్ట్ర వాటాగా పరిగణించిందన్నారు. మిగిలిన మొత్తం రూ.25,760 కోట్లలో ఇప్పటికే రూ.15,146 కోట్లు ఇవ్వాలన్నారు. అయితే ప్రస్తుతం రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధానికి మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

"పోలవరం అంటేనే ప్రజలకు సెంటిమెంట్. గోదావరి, కృష్ణా నదుల్లో నీరున్నా కొంత వృధాగా సముద్రంలోకి పోతోంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఇబ్బందులకు గురి అయ్యింది. విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ముంపు మండలాలు ఏపీకి ఇవ్వలేదు. అనంతరం కేంద్రంతో చర్చించి ముంపు మండలాలు సాధించుకున్నాం. 28 సార్లు క్షేత్ర స్థాయికి వెళ్లా, 82 సార్లు వర్చువల్ గా సమీక్ష చేశాను. 2019 వరకూ పోలవరం 72 శాతం పని పూర్తి చేశాం. కాంక్రీటు పనులు, డయాఫ్రమ్ వాల్ పనులు, స్పిల్ వే, కాఫర్ డ్యాంలు కూడా నిర్మించాం. రూ.4,114 కోట్లను అప్పటికే పునరావాసం కోసం ఖర్చు చేశాం. 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి ఆ ప్రాజెక్టు పాలిట శనిలా దాపురించింది" - సీఎం చంద్రబాబు

పండగ పూట కూడా ప్రాజెక్టు గురించి అప్పట్లో కేంద్ర మంత్రికి వద్దకు వెళ్లాలని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. సుప్రీంకోర్టు,హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించానన్నారు. 2019లో అధికారం చేపట్టిన జగన్.. ప్రమాణం స్వీకారం చేసిన తొలి రోజే ప్రాజెక్టు పనులు నిలిచివేశారన్నారు. అధికారులను, కాంట్రాక్టర్ లను అక్కడి నుంచి తరిమేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు కొన్నా్ళ్లు అనాథగా నిలిచి పోయిందన్నారు. రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారని వైఎస్ జగన్ పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్, కాఫార్ డ్యామ్ లు దెబ్బతిన్నాయన్నారు. 2019-24 మధ్య కేంద్రం పోలవరానికి ఇచ్చిన డబ్బులు కూడా మళ్లించేశారని ఆరోపించారు.

జగన్ తప్పిదాల వల్లే పోలవరానికి ఈ పరిస్థితి

కాంట్రాక్టర్ ను మార్చ వద్దని ప్రాజెక్టు అథారిటీ, జలవనరుల శాఖలు లేఖలపై లేఖలు రాసినా వైసీపీ పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పిదాల వల్ల జాతి ప్రయోజనాలు ఎంత దెబ్బతింటాయి అన్న దానికి పోలవరం ప్రాజెక్టు ఒక ఉదాహరణ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని నమ్మకం కలిగిందన్నారు. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్ లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్ లు కేటాయించారన్నారు. మొత్తం రూ.28 వేల కోట్లు వీటిపై వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.

"కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయి. కృష్ణపట్నం నోడ్ కూడా అనుమతి ఇచ్చారు. నక్కపల్లి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోంది. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణం అవుతాయి. గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్లీ గట్టెక్కింది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని నిపుణులు తేల్చారు. డయాఫ్రమ్ వాల్ కు రూ.990 కోట్లు వ్యయం అవుతుంది. 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం"-ఎన్. చంద్రబాబు నాయుడు , ముఖ్యమంత్రి